మోడీ పర్యటన బహిష్కరణ.. కేటీఆర్
posted on Jul 7, 2023 @ 2:40PM
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు ఆహ్వానం అందినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పర్యటనలో పాల్గొనరనీ, బీఆర్ఎస్ ఆయన పర్యటనను బహిష్కరిస్తోందని స్పష్టం చేశారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ పుట్టుకనే అవమానించిన మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, తెలంగాణపై మోడీ మొసలి కన్నీరును రాష్ట్ర ప్రజలు నమ్మరనీ కేటీఆర్ అన్నారు.
ఏది ఏమైనా గత ఏడాది రెండేళ్లుగా ప్రధాని మోడీ ఎప్పుడు అధికారిక పర్యటనకు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రొటోకాల్ ఉల్లంఘించి మోడీ పర్యటనకు దూరంగా ఉండటం పరిపాటిగా మారింది. గతంలో ఒక సారి తెలంగాణలో హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్ వచ్చారు. ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి.ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది. అయినా కేసీఆర్ డుమ్మా కొట్టారు.
అలా డుమ్మా కొట్టడానికి కారణం పీఎంవో నుంచి తనను ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ వచ్చిన సూచన అని చెప్పారు. అయితే దానిని పీఎంవో ఖండించడంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే మోడీకి ముఖం చాటేశారని అర్ధమైంది. అలాగే హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇంకా ఇక్రిశాట్ లో కార్యక్రమానికీ డుమ్మా కొట్టారు. దానికీ అదే కారణం చెప్పారు. యధావిధిగా పీఎంవో దానికి ఖండించింది. అయితే ఈ సారి మాత్రం మోడీ పర్యటనను బీఆర్ఎస్ బహిష్కరిస్తోందని ప్రకటించడం కొసమెరుపు.