తల్లి ప్రేమ ముందు పాము ఓ లెక్కా?!
posted on Sep 5, 2022 @ 2:48PM
పిల్లలకి అన్నీ తల్లే. ఆనందంలో, బాధలోనూ. మంచిమార్కులు వస్తే రిపోర్టుతో తల్లిదగ్గరకే ముందు పరుగు. ఆ తర్వాతనే సంతకం కోసం తండ్రి దగ్గరికి. రాయి రప్పా తగిలితే అమ్మా అంటూనే కట్టు కట్టిం చుకోను తల్లి దగ్గరికే పరుగు. తర్వాతే నాన్నవెళ్లి మందులు తెస్తాడు. తల్లి అంటే గొప్ప ఆనందం, తల్లి అంటే గొప్ప రక్ష.
ఎంత దూరంలో ఉన్నా ఈ పిచ్చి వెధవ సరిగా ఉన్నాడో లేదో, తిన్నాడో లేదో, చదువుతున్నాడో లేదో అనే అనుకుంటుంది తల్లి. మరీ ఐదారు తరగతిలో ఉన్నవాడయితే , వాడికి దాదాపు దరిదాపుల్లోనే తిరుగుతూంటుంది తల్లి. అలాంటి ఓ తల్లి తన పిల్లడిని అమాంతం పెద్ద త్రాచు నుంచి కాపాడుకుంది.
కర్ణాటకా మాండ్యా లో ఓ తల్లి కొడుకు అప్పుడే ఇంట్లోంచి బయటికి వచ్చారు. మెట్లు దిగే సమయంలో హఠాత్తుగా పిల్లడి కాలుకి పెద్ద త్రాచుపాము తగిలింది. వాడు కెవ్వున అరిచేసరికి తల్లికి గుండాగినంత పనయింది. తీరా చూస్తే త్రాచుపాము పిల్లడిని కాటు వేయడానికి తల ఎత్తింది. రెప్పపాటులో ఆ తల్లి పిల్లడి చేయి పట్టి ఇవతలకి లాగి పడేసింది. ఇదంతా సిసిటీవీలో రికార్డయింది.
తర్వాత చాలాసమయానికి అంతా తేరుకున్న తర్వాత ఆ పాము ఎటు వెళ్లిందీ ఎవరూ గమనించలేదు. కానీ ఎటో వెళిపోయింది. ఆమె భయం భయంగా పిల్లడిని హత్తుకునే ఉండిపోయింది. తర్వాత ఎప్పుడో తేరుకుని సీసీటీవీ ఫుటేజ్ని జనంతోపాటు చూసింది. పెద్దత్రాచు తల పైకెత్తి కాటువేయడానికి ముందు కు వచ్చినపుడు ఏదో శక్తి ఆవహించినట్టయి పిల్లడిని చేయిపట్టి లాగేయగలిగానని అన్నది ఆ తల్లి.