మునుగోడుకు ‘ముందస్తు’మందు ?
posted on Sep 5, 2022 @ 2:45PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే వార్తలు రాజకీయ, మీడియా వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి ఒకటికి రెండు సార్లు అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. చివరకు గత మార్చిలో జరిగన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనూ అదే విషయం స్పష్టం చేశారు. కానీ . ఒకటి రెండు నెలల తర్వత మళ్ళీ ఆయనే, విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఉంటే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
ఒక రకంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సవాలు విసిరారు. (అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాస 100 కి పైగా స్థానాలతో విజయం సాధిస్తుందనే ధీమా కుడా వ్యక్త పరిచారు. సరే అది వేరే విషయం ) ఏది ఏమైనా ఇంచుమించుగా ఏడెనిమిది నెలలకు పైగానే, ముందస్తు ఎన్నికల ముచ్చట రాజకీయ, మీడియా వర్గాల్లో తరచూ వినిపిస్తూనే వుంది అధికార తెరాస సహా ఆన్ని రాజకీయ పార్టీలులలోనూ ముదస్తు వస్తే.. అనే కోణంలోనూ ఎన్నికల సన్నాహాలు సాగుతున్నాయి. ఇక ప్రస్తుతంలోకి వస్తే, మంగళవాకం (సెప్టెంబర్ 6) నుంచి రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో, ఇప్పుడు ముందస్తు ముచ్చట మళ్ళీ మరోమారు తెర మీదకు వచ్చింది. అయితే, రెండు రోజుల క్రితం (శనివారం) జరిగిన తెరాస సభాపక్ష సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే లేదని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారని అంటున్నారు. సో .. ముందస్తు ఎన్నికల ముచ్చటను ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? అంటే, అవుననే వారే కాదు, కాదనే వారు కూడా ఉన్నారు. తెరాస నాయకులలో కూడా కొందరు, మంగళవారం (సెప్టెంబర్ 6) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలే ప్రస్తుత అసెంబ్లీ ఆఖరి సమావేశాలు కావచ్చనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.
మరో వంక రాజకీయ, మీడియా వర్గాల్లోనూ అటూ ఇటుగా అదే చర్చ జరుగుతోంది, నిజానికి, ఒకే రోజు (సెప్టెంబర్3) మంత్రివర్గ సమావేశం, తెరాస శాసనసభా పక్ష సమావేశం నిర్వహించడం, అది కూడా శాసనసభ సమావేశాలకు రెండే రెండు రోజుల ముందు కావడంతో, ముఖ్యమంత్రి కీలక నిర్ణయం ఏదో తీసుకుంటారని, అందరూ అనుకున్నారు, అయితే, మంత్రివర్గ సమావేశంలో అలాగే, శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ఆ ప్రస్తావన చేయలేదు. కానీ, పరోక్షంగా మాత్రం ముందస్తుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలే ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టలేదనే విషయం అర్థమవుతుందని అంటున్నారు.
నిజానికి మంత్రివర్గ సమావేశం, ఆ వెంటనే శాసన సభా పక్ష సమావేశం నిర్వహించడంలోనే అనుమానాలు మొదలయ్యాయి. అలాగే, శాసన సభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మర్మగర్భంగా చేసిన కీలక వ్యాఖ్యలు అనుమానాలను మరింతగా బలపరిచేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటిలానే సర్వే ప్రస్తావన తెచ్చారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, 72 నుంచి 80 స్థానల్లో తెరాస గెలుస్తుందని, కొద్దిగా కష్టపడితే 90 దాకా వెళ్ళే అవకాశం ఉందని తాజా సర్వే చెప్పినట్లు చెప్పారు. ఒకటి రెండు నెలల క్రితం మొత్తం 119 నియోజక వర్గాలకు గానూ 105 నియోజక వర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఘంటాపథంగా చెప్పిన ముఖ్యమంత్రి, ఒక్కసారిగా 72 నుంచి 80 స్థానాలకు, 25 స్థానాలు దిగివచ్చారు.
అంటే తెరాస గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించినట్లు గుర్తించవలసి ఉంటుదని అంటున్నారు. నిజానికి గతంలోనే, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆలస్యం అమృతం విషం అని హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి.ఎన్నికలు ఆలస్యం అయిన కొద్దీ అధికార పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, సో ముందస్తుకు వెళ్ళడమే ఉత్తమమని పీకే సూచించినట్లు వార్తలొచ్చాయి. సో ముఖ్యమంత్రి, సర్వే ప్రస్థావన తీసుకురావడం ముందస్తు ఎన్నికలకు ఒక సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, సిట్టింగ్ ఏమ్మేల్యీలు అందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తామని చేసిన ప్రకటన కూడా ముందస్తుకు ‘ముందస్తు’ సంకేతం సంకేతం అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి, మంగళ వారం నుంచి మొదలయ్యే శాసనసభ సంవేసాలు ముగిసిన వెంటనే, మంచి ముహూర్తం చూసుకుని అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే, నవంబర్, డిసెంబర్ నెలలలో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లేదంటే వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అన్నిటినీ మించి, అసెంబ్లీ రద్దుతో మునుగోడు ఉప ఎన్నిక గండం దాటేయ వచ్చని ముఖ్యమంత్రి అలోచిస్తునట్లుగా తెలుస్తోంది.
నిజానికి, మునుగోడులో ఇప్పటికీ తెరాసకే ఎడ్జ్ ఉందని అనుకుంటున్నప్పటికీ, కీడెంచి మేలేంచడం మంచిదనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనను ముందుకు తీసుకు పోతున్నారని అంటున్నారు. అలాగే ఎక్కువ సమయం ఇస్తే, బీజేపీ, కాంగ్రెస్ బలబలాల్లో వచ్చే హెచ్చు తగ్గుల ప్రభావం అంత బలంగా ఉండక పోవచ్చని ముఖ్యమంత్రి లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చివరకు ఏ నిర్ణయం అయినా ముఖ్యమంత్రి తీసుకోవలసి ఉంటుంది.సో. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏమి ఆలోచిస్తున్నారో, రేపేమి చేస్తారో ముందు ముందు చూడవలసిందే .. అంటున్నారు.