హర్‌ఘర్ తిరంగాను తిరస్కరించిన శిరోమణి అకాలీదళ్(ఎ)
posted on Aug 10, 2022 @ 2:05PM
దేశంలో పరిస్థితులు చాలాచిత్రంగా ఉన్నాయి. మీ ఇల్లు, ఉద్యోగం, భారతీయతా బాహాటంగ ప్రకటించుకోవాలి. లేకపోతే ఎవరైనా ఏదైనా సంశయిస్తారు. పూర్వీకుల కాలం నుంచి భారత్‌లో ఉన్నా, భారత్‌లోనే ఏదో ఒక రాష్ట్రంలో పుట్టి పెరుగుతున్నా సరే నీ దేశభక్తిని మరోసారి ప్రకటించుకోవాలి. ఇది బీజేపీ వారి శాసనం. దీనికి తిరుగులేదు. బీజేపీ వారి తలతిక్క ఆలోచనకు విపక్షా లతో పాటు ప్రజలూ నవ్వుకుంటున్నారు. తాజాగా బీజేపీ వారు కొత్త నినాదం తెచ్చారు. మన దేశ స్వాతంత్య్రదినోత్సవం సంద ర్భంగా ప్రతీ ఒక్కరూ మొబైల్లో త్రివర్ణపతాకాన్ని పెట్టుకోవాలని, ఇళ్ల మీద జెండాను ఎగురవేయాలని. అలా చేస్తేనే మనసావాచా దేశభక్తులని ప్రధాని ఉవాచ సారాంశం. ప్రజలకు లేని అనుమానాన్ని కల్పించడం అంటే ఇదే. మా వూళ్లో, రాష్ట్రంలోనే కదా ఉంట, ఎటూ వెళ్లిపోలేదే .. అనే ఆలోచనలో జనం పడేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరు ఉంది.
అయితే ఇదంతా కేవలం బీజేపీ వీరాభిమానుల సంఖ్యను లెక్కించడానికి వేసిన వినూత్న పథకం అంటూ విమర్శకులు అంటు న్నారు. కొండకచో ఇదీ నిజమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అడిగినట్టు విడిగా ఎవరినీ మా పార్టీనా ఎగ స్పార్టీనా అని ఎవరు మాత్రం అడగ గలుగుతారు. అందుకే ఈ పథకం వేసారని అంటున్నారు.
కాగా ఇటువంటి పిచ్చి ఆలోచనలు, వ్యూహాలు మానుకోవాలని శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) పార్టీ చీఫ్ సిమ్రాన్ జిత్ సింగ్ మాన్ మండిపడుతున్నారు. హర్ ఘర్ తిరంగా అనే నినాదాన్ని కేంద్రం మానుకోవాలని ఆయన సూచించారు. ఆగష్టు 14,15 తేదీల్లో తమ నినాదాన్ని అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. అసలా మాటకు వస్తే, తమది వేరే వర్గమని తిరంగా ప్రచారంలో పాల్గొనేది లేదని ఎస్ ఏడి(ఏ) ఛీఫ్ స్పష్టం చేశారు.