14 నెలలు..రూ.20 కోట్ల అవినీతి!
posted on Aug 10, 2022 @ 1:22PM
పక్కనే ఉన్నంత వరకూ మనోడు, పక్కకి వెళితే పరాయోడు..బెమ్మంగారు జెప్పారు.. చెట్టుకింద చుట్టతాగుతూ మనిమన్నన్ చెప్పాడు. నిజవే. దీనికి కాలం, ప్రాంతంతో బొత్తగా సంబంధం లేదు. ఎవరు ఎందులోకయినా జంప్ కావడానికి మన దేశంలో ఉన్నంత సౌకర్యం మరోటి ఉండదేమో! ఇపుడు తాజాగా తమిళనాట ఇదే జరుగుతోంది. డీఎంకే పాలనలో కేవలం 14 మాసాల్లో రూ.20 కోట్లు భోంజేశారని అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.
మంగళవారం (ఆగస్టు9)ఆయన కడియంపట్టిలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అన్నాడీఎంకే అమలుచేసిన సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు మరికొన్ని పథకాలకు పేర్లు మార్చి తాము ప్రవేశపెట్టినట్లు ప్రకటనలు గుప్పిస్తోందన్నారు.
గతంలో కరుణానిధి, తర్వాత స్టాలిన్, తర్వాత ఉదయనిధి, భవిష్యత్తులో ఇన్బనిధి.. ఇదేమైనా రాజకీయ పరంపరా? అని ప్రశ్నిం చారు. ఆ పార్టీలో మరెవ్వరినీ ముఖ్యమంత్రిని కానివ్వరని ఆరోపించారు. ఆస్తి, విద్యుత్ చార్జీలు పెంపుతో డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పళనిస్వామి పేర్కొన్నారు