హైకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు- రైతుల మహాపాదయాత్రకు ఓకే
posted on Nov 1, 2022 @ 3:55PM
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్ర ఇక ఆగిపోయినట్టేనంటూ బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు హైకోర్టు తీర్పుతో పసలేనివిగా మారిపోయాయి. అమరావతి రైతులు తమ పాదయాత్రను పున: ప్రారంభించవచ్చని హైకోర్టు విస్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల పాదయాత్ర నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలన్న పూర్వపు ఆదేశాలను అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్న వారు మాత్రమే పాదయాత్రలో కొనసాగాలన్న తమ పూర్వ ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐడీ కార్డులను రైతులకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక యాత్రకు సంఘీభావం తెలిపే వారిపై ఎటువంటి ఆంక్షలూ లేవని హైకోర్టు తన ఉత్తర్వులలో విస్పష్టంగా చెప్పింది. సంఘీభావం తెలిపే వారు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలుపవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.ఈ విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ మంగళవారం (నవంబర్1) తన ఉత్తర్వులలో హై కోర్టు స్పష్ఠం చేసింది. పాదయాత్రను నున: ప్రారంభించుకోవచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
కాగా పోలీసుల తీరుకు నిరసనగా గత నెల 22న రైతులు తమ పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి విదితమే. అమరావతి నుండి అరసవిల్లి వరకు చేస్తున్న మహాపాదయాత్రకు విరామం ప్రకటించారు. పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులోనే తేల్చుకుని పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తామని అమరావతి రైతుల ఐకాస ప్రకటించింది. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు నా తాత్కాలిక విరామం మాత్రమే ఇస్తున్నట్లు ఐకాస వెల్లడించింది.
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. రైతులు శుక్రవారం రాత్రి బస చేసిన ఫంక్షన్ హాల్ ను ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి చుట్టుముట్టారు. ఈ సందర్భంగా బయటి నుంచి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. మద్దతు తెలిపేందుకు వస్తున్న వారని ఎక్కడికక్కడ నిలిపేశారు.
హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది రైతుల ఐడీ కార్డులు చూపించాలని ఒత్తిడి తెచ్చారు. అనుమతి ఉన్న వాహహనాలు తప్ప ఇంకే వాహనాన్నీ అనుమతించేది లేదంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు- అమరావతి రైతుల మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. దీంతో అమరావతి రైతుల ఐకాస నేతలు అప్పటికప్పుడు సమావేశమై పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.