మునుగోడులో టీఆర్ఎస్- బీజేపీ డిష్యుం డిష్యుం..రాళ్ల దాడి, ముష్టిఘాతాలతో పలివెల రణరంగం
posted on Nov 1, 2022 @ 3:08PM
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న క్రమంలో టీఆర్ఎస్- బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం ఇరు పార్టీల శ్రేణులు ఘర్షణకు దారితీసింది.
ఈ ఘర్షణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ జగదీశ్ కు దెబ్బలు తగిలాయి. ఈటల రాజేందర్ పీఆర్ఓ కాలికి కూడా గాయం అయింది. ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు ప్రచారం సాఫీగానే కొనసాగిందనే చెప్పాలి. మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగుస్తుందనగా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఘర్షణ జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
ఈటల రాజేందర్ కాన్వాయ్ పలివెల రాగానే కాన్వాయ్ లోని వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాన్వాయ్ వెంటే ఉన్న బీజేపీ శ్రేణులు ఆ దాడిని ఎదుర్కొని, ప్రతిగా రాళ్లతో దాడులు చేశారు. వారు పరస్పరం పిడిగుద్దులు కూడా గుద్దుకున్నారు. ఈక్రమంలోనే ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో కూడా దాడులు చేసుకున్నాయి. అయితే.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్ఎస్- బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. అయినా.. ఆగ్రహం చల్లారని రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు.
ఈ దాడుల ఘటనపై ఈటల స్పందిస్తూ.. తాను, తన సతీమణి ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనానికి వచ్చినట్లు చెప్పారు. మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలోనే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం తమ తమ వర్గాలతో కలిసి రాళ్లతో దాడి చేశారని చెప్పారు. పార్టీ జెండాల్లో రాళ్లు, కర్రలు తీసుకొచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారని ఆరోపించారు. ఈ దాడికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమని ఈటల ఆరోపించారు.