పెరోల్ బాబా ఆశీర్వాదానికి బీజేపీ మంత్రి ఠాకూర్
posted on Nov 1, 2022 @ 4:00PM
ఊళ్లోకి కొత్త సాములోరు వచ్చారని అంతా వెళ్లారు. తీరా చూస్తే మొన్నామద్య దొంగపనులు చేస్తు న్నారని పోలీసోల్లు పట్టుకెల్లిన కేటుగాడే గదా.. అనుకున్నారంతా. కానీ పైకి అనుకోలేదు. అంతా భక్తి పారవశ్యాన్ని నటించారు. చాలాకాలం భక్తిపారవశ్యంతో ఊగిపోతూ ఎన్నో ప్రవచనాలు వల్లించి, పాటలు పాడి భక్తిని ప్రసారం చేసినవాడు అత్యా చారంలో దొరికిపోయి జైలుకీ వెళ్లాడు. ఆయనే గుర్మీత్ రామ్ రహీమ్ బాబా. ఆయనన్ను ఇటీవలే పెరోల్ మీద విడుదల చేశారు.
కానీ భక్తులను ఆకట్టుకోవడంలో ఆయన్ను మించినవారే లేరు గనుక మళ్లీ ప్రవచనాలు, భక్తీగీతాల పనలతో జనాన్ని తన శిబిరానికి వచ్చేట్టు చేసుకున్నారు. బాబా వచ్చేశారని వెర్రి జనం వేలం వెర్రిగా ఎగబడ్డారు. ఆయన దర్శనానికి వెళ్లినవారిలో హిమాచల్ ప్రదేశ్ బీజేపీ మంత్రి విక్రమ్ థాకూర్ , ఇతర మంత్రులు కూడా క్యూకట్టారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతటి కష్టమైనా ఇట్టే దాటేయవచ్చన్న మూఢ నమ్మకం వారిది. సామాన్య జనంతో పాటు వీరు పెరోల్ మీంచి వచ్చిన ఆ దైవాంశసంభూతుడి ఆశీర్వాదం కోసమే వెళ్లారు.
చిత్రమేమంటే మరో నెల రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే బాబాకు పెరోల్ రావడం, ఆయన సత్సంగ్ నిర్వహించడం, అందులో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలూ పాల్గొనడం ట్విస్ట్. బీజేపీ వారి వింత నిర్ణయాలకు ఇదేమీ కొత్త కాదు. ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలో చేయాల్సిన వ్యూహాత్మక ముందడుగును అలానే అమలు చేయడంలో సిద్ధహస్తులు కమలనాథులు. ఎన్నికల సమయంలోనే భక్తి పొంగిపొర్లుతుంటుంది. అప్పుడే తప్పుచేసినవాడు, జైలుకి వెళ్లి వచ్చిన వాడు కూడా మహాత్ముడై పోతుంటాడు. పెరోల్ మీద ఉన్నంత మాత్రాన ఈ బాబా సత్సంగ్ నిర్వహిం చడానికి ఎలా అనుమతించారన్నది ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.