జగన్ విడుదల అయితే పండగ చేసుకోండి

 

జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్నపాదయాత్రకి ఆదివారం నాడు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో మాట్లాడుతూ ‘జగనన్న బయటకి వచ్చిన నాడే మనకి పండుగ’ అని, ‘రాజన్న రాజ్యం వచ్చినప్పుడే మనకు అసలైన పండుగ’ అని అన్నారు. ఆమె తన సోదరుడు జైలు నుండి విడుదలయి బయటకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బయటకి వచ్చినప్పుడే ప్రజలకి పండుగ అని చెప్పడం విడ్డూరంగా ఉంది.

 

జగన్ మోహన్ రెడ్డి తనకు ముఖ్యమంత్రి పదవి ఈయనందుకు కాంగ్రెస్ పై అలిగి బయటకి వచ్చి, స్వంత కుంపటి పెట్టుకొని, అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు తప్ప షర్మిల చెపుతున్నట్లు, ప్రజల కోసం జైలుకు వెళ్లి కష్టాలు పడటంలేదు. ఆయన జైలుకు వెళ్ళక మునుపు చేసిన ‘ఓదార్పుయాత్ర’, ప్రస్తుతం ఆమె చేస్తున్న’మరో ప్రస్థానం’ పాదయాత్ర రెంటి లక్ష్యం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల, ఆయన బయటకి వస్తే ఆయన కుటుంబం, ఆయన పార్టీ వారికీ, ఆయనను అభిమానించేవారికి పండుగ అవుతుంది తప్ప ప్రజలందరికీ కాదు.

 

ఆయన కష్టాలని ప్రజల కష్టాలుగా, అయనకి అధికారం దక్కితే ప్రజలకి పండుగని ఆమె చెప్పడం కేవలం ప్రజలను మభ్య పెట్టడమే అవుతుంది. ప్రజలలో ‘నిశబ్ద విప్లవం’ వచ్చి ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కిస్తుందని చెప్పే బదులు, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయమని నేరుగా ప్రజలను కోరిఉంటే ఇంకా బాగుండేది.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గెలిస్తే, జగన్ జైలు నుండి నిర్దోషిగా బయపడి అధికారం చేపడితే, ఆమె ఇప్పుడు ప్రజలకి చేస్తున్నవాగ్దానాలను ఆయన నెరవేరిస్తే, ఆమె హామీ ఇస్తున్న ‘రాజన్న రాజ్యం’( అంటే ఆ రాజ్యంలో ప్రజలకి సుఖాలే తప్ప కష్టాలు అసలుండవని ఆమె ఉద్దేశ్యం) గనుక ఏర్పరిస్తే అప్పుడు ‘పండుగ చేసుకోండి’అని ప్రజలకు ఆమె చెప్పనవసరం లేదు. ప్రజలే స్వచ్చందంగా పండుగ చేసుకొంటారు.

 

కానీ, రాష్ట్రంలో యదార్ధ పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారయినా, రాబోయే ఎన్నికల తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా, వారి దగ్గర ఏదయినా ‘మంత్రం దండం’ ఉంటే తప్ప రాష్ట్ర పరిస్థితులను మార్చడం అసంభవం అని అర్ధం అవుతుంది. కానీ, తమ పార్టీలు అధికారంలోకి వస్తే చిటికెలో ప్రజల కష్టాలన్నిటినీ మాటుమాయం చేసేస్తామని చెప్పడం ప్రజలను అవివేకులుగా భావించి మభ్య పెట్టడమే అవుతుంది.

 

పైగా, ఏమాత్రం రాజకీయ అనుభవం కానీ, నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం వంటి వివిధ వ్యవస్థల పట్ల ఏమాత్రం అవగాహనలేని ఆమె ఈవిధంగా మాట్లాడటమే కాకుండా వాటిపై వాగ్దానాలు కూడా చేయడం ప్రజలను మభ్య పెట్టడమే అవుతుంది.

 

ఇక, సీబీఐ కేవీపీని జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ చేయడమే కాకుండా, సీబీఐ జాయింటు డైరెక్టరు లక్ష్మి నారాయణ తమ విచారణ ముగించడానికి నిర్దిష్ట గడువేమి లేదని, ఈ విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాలు సంబందిత వెబ్ సైటులో ఉన్నాయని చెప్పడంతో త్వరలో తన సోదరుడు జైలు నుండి విడుదల అవుతాడని గట్టిగా నమ్ముతూ, అదే విషయాన్ని ప్రజలకి కూడా పదే పదే చెపుతున్న షర్మిలకు ఊహించని ఎదురుదెబ్బగా తగిలాయి. అందువల్ల ఆమెకు ఆగ్రహం కలగడం సహజమే. అయితే సీబీఐ ఇంతకాలం విచారణ చేయకుండా గాడిదలు కాస్తోందా? అంటూ తీవ్రపదజాలం వాడటం ఆమెకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టగలవు. గత కొద్ది నెలలుగా ఈవిధంగా నోరు జారిన అనేక మంది మహామహులు ఎదురు దెబ్బలు తినడం అందరూ చూస్తున్నదే.

 

ఆమె తన పాదయాత్ర ద్వారా పార్టీ క్యాడర్లను నిర్లిప్తలో కూరుకుపోకుండా చాలా చక్కగా కాపడుతున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ప్రజలకు ఇటువంటి శుష్క వాగ్దానాలు చేస్తూ పాదయాత్రలతో ఈ ఏడాది కాలాన్ని వృధా చేసుకొనే బదులుగా, మిగిలిన ఈ కొద్దిపాటి విలువయిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొంటూ పార్టీని క్షేత్ర స్థాయి నుండి పటిష్టపరుచుకోవడంపై ఆమె దృష్టి కేంద్రీకరిస్తే, ఆమె పార్టీ ఎన్నికలలో గెలిస్తే అప్పుడు వారే పండుగ చేసుకోవచ్చును.