జబ్బలు చరుచుకొంటున్న కేంద్ర ప్రభుత్వం

 

 

ఇటలీ ప్రభుత్వం ఎట్టకేలకు తన ఇద్దరు నావికులను భారత్ కు తిరిగి పంపడంతో, ఇంతవరకు నిందలు, కష్టాలే తప్ప ఒక్క ప్రశంస, విజయం కూడా చవి చూడని యుపీయే ప్రభుత్వం వారిరువురినీ వెనక్కి రప్పించడం తమ ఘనతే అంటూ మీడియా ముందు జబ్బలు చరుచుకొంటోందిప్పుడు.

 

విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ కుర్షిద్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాము అవలంభించిన సమర్ధమయిన దౌత్యవిధానం వలనే ఇది సాధ్యం అయిందని చెప్పుకొన్నారు. అయితే, వారిని తిప్పి పంపేందుకు ఇటలీ ప్రభుత్వం తమ నుండి రెండు హామీలను కూడా కోరిందని వాటికి తాము అంగీకరిస్తూ వెంటనే జవాబు ఇచ్చినందునే ఇంత త్వరగా ఆ ఇద్దరు నావికులను భారత్ కు తిరిగి రప్పించగలిగామని ఆయన అన్నారు. ఇద్దరు భారతీయ మత్స్యకారులను చంపిన నేరంలో కేసులేదుర్కొంటున్న ఆ ఇద్దరు ఇటలీ నావికులను భారత్ లో అడుగుపెట్టిన తరువాత అరెస్ట్ చేయడం కానీ, వారికి మరణ శిక్ష విదించడం కానీ చేయరాదని ఇటలీ ప్రభుత్వం షరతులు విదించి, అందుకు భారత్ హామీ ఇచ్చిన తరువాతనే వారిని వెనక్కి తిప్పి పంపిందని ఆయనే స్వయంగా నిన్న మీడియాకు తెలిపారు. అయినా కూడా అది తమ ఘన విజయంగానే అభివర్ణించుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లు.

 

ఇద్దరు భారతీయుల మరణానికి కారకులయిన వారిని అరెస్టు చేయడానికి కూడా వీలులేనపుడు వారిని ఏమిచేయాలని ఇటలీ ప్రభుత్వం ఆశిస్తోందో ఇటలీ పేర్కొనలేదు. వారితో ఏవిధంగా వ్యవహరించదలచకుందో భారత ప్రభుత్వం కూడా పేర్కొనలేదు.

 

వారిని భారత్ కి తిరిగి రప్పించడమే ఒక పెద్ద ఘన కార్యంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇక ఇప్పుడు వారిరువురికీ సకల రాచమర్యాదలు చేస్తూ, ప్రభుత్వ ఖర్చులతో వారిని కొద్దిరోజులు కోర్టులు కేసులు అంటూ డిల్లీలో షికార్లు చేయించి, ఆనక ప్రతిపక్షాలు దృష్టి మరో అంశం మీదకు మళ్ళిన తరువాత వారిరువురినీ చడీచప్పుడు లేకుండా దేశం దాటించి పంపాలని ఆలోచిస్తున్నట్లు ఉంది. లేదంటే ఇటలీ ప్రభుత్వం విదించిన ఆ రెండు షరతులకు ఒప్పుకొని ఉండేది కాదని చెప్పవచ్చును.

 

ఒకవేళ సుప్రీం కోర్టు ప్రభుత్వం ఇటలీకి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వారిరువురినీ అరెస్ట్ చేయమని ఆదేశిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమిచేస్తుంది? ఒకవేళ సుప్రీం కోర్టు వారిరువురినీ దోషులుగా తేల్చి ఇద్దరికీ శిక్షలు విదిస్తే అప్పుడు ప్రభుత్వం సుప్రీం కోర్టును అడ్డుకొంటుందా లేక ఇటలీ ప్రభుత్వానికి తానూ ఇచ్చిన హామీలను తీసి పక్కన పెడుతుందా?

 

భారతదేశానికి ఇటలీ రాయభారి సుప్రీం కోర్టుకు తమ ఇద్దరు నావికులను ఇటలీ నుండి వెనక్కి రప్పిస్తానని, అందుకు తానూ పూర్తి బాధ్యతా వహిస్తానని వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీని పట్టుకొని ఇటలీని నిలదీసిన భారత ప్రభుత్వం, ఇప్పుడు తానూ ఆ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించగలదా? లేక సుప్రీం కోర్టుకు వారిరువురి విషయంలో మార్గదర్శనం చేస్తుందా?

 

ఒకవేళ ప్రభుత్వ అభీష్టానికి విరుద్దంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే, అప్పుడు ఇటలీ దేశం అంతర్జాతీయ వేదికలపై ఇదేవిషయాన్ని పెడితే ఏర్పడే పర్యవసానాలను కేంద్ర ప్రభుత్వం ఊహించిందా? లేక ఇటలీ నావికులను భారత్ రప్పించే ప్రయత్నంలో యధాలాపంగా ఇటలీ షరతులకు బుర్ర ఊపి ఒప్పేసుకొందా? ఏమయినప్పటికీ, ఇది యుపీయే ప్రభుత్వ విజయం కాదు సరికదా దౌత్యపరంగా కూడా ఘోర వైఫల్యమేనని చెప్పక తప్పదు.

 

ఒక సమస్యను పరిష్కరించరించే ప్రయత్నంలో యుపీయే ప్రభుత్వం మరో పెద్ద సంక్షోభానికి తెర తీసింది. సుప్రీం కోర్టు ఆ ఇద్దరు దోషులను ప్రత్యామ్నాయ శిక్షలతో (నష్ట పరిహారం కింద కొంత డబ్బు చెల్లించడం వగైరా) సరిపెట్టి పంపేందుకు అంగీకరిస్తే మరో సంక్షోభం తప్పుతుంది. లేదంటే అంతర్జాతీయ వేదికల మీద భారత్ కు అవమానాలు, సంజాయిషీలు తప్పవు.