సారీ! తెలంగాణా కోసం మాట్లాడలేను
posted on Mar 26, 2013 @ 1:06PM
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణా విషయంలో ఇంతవరకు వెనుక నుండి సలహాలు ఈయడమే తప్ప, ఎన్నడూ తెర ముందుకు వచ్చి నిర్ద్వందంగా తన అభిప్రాయం చెప్పలేదు. తాను అధికార పార్టీలో బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్నందునే మాట్లాడలేకపోతున్నానని ఆయన అనడం న్యాయమే. అయితే, ఆయన ఆ పదవిలో ఉనంతకాలం కూడా ఏమి మాట్లాడలేన్నపుడు, కేంద్రమంత్రిగా తన పరపతిని ఉపయోగించి కేంద్రాన్ని ఒప్పించలేనప్పుడు, ఆయన వలన తెలంగాణా కోరుకొంటున్నవారికి ఏమి ప్రయోజనం? ఆయన తెలంగాణాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కేంద్రమంత్రిగా తెలంగాణాపై మాట్లాడేందుకు తనకున్న పరిమితులు చెప్పుకొచ్చి, తన పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రజలను కోరడం నవ్వు తెప్పిస్తుంది.
ఆయనకు తెలంగాణ ఏర్పడాలని నిజంగా బలమయిన కోరికే ఉండి ఉంటే, అటు కేంద్రంతో తెలంగాణా కోసం పోరాడటమో లేక తెలంగాణా అనే పదం ఉచ్చరించడానికి కూడా అడ్డం పడుతున్న తన కేంద్రమంత్రి పదవిని, తన యంపీ పదవినీ త్యాగం చేసి, తెలంగాణా ఉద్యమానికి సారద్యం వహించడమో లేక వారితో కలిసి పోరాడటమో చేసి ఉండేవారు. గానీ, ఆయన తన మంత్రి పదవిని వదులుకోలేదు సరికదా, దాని వలననే తానూ తెలంగాణాపై మాట్లాడలేకపోతున్నానని క్షమించండంటూ తర్కం మాట్లాడుతున్నారు.
మే నెలలోగా కేంద్రం తెలంగాణా ప్రకటించకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఆయన అనుచరులు చెపుతున్నట్లు న్యూస్ పేపర్లలోవార్తలు ప్రచురితమయ్యాయి. ఆయన నిర్ణయం అదే అయినప్పుడు ఆ మాటేదో ఆయనే స్పష్టంగా ప్రజలకు, మీడియాకు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. కానీ, తన అనుచరుల ద్వారా మీడియాకు చెప్పడం, మీడియా ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్ళేలా చేయడం చూస్తుంటే తెలంగాణా పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతోంది.
దీని వెనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మీడియాలో వస్తున్న వార్తలను చూసి కంగారు పడి ఆయనకు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తే ఆయనది పైచేయి అవుతుంది. అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయినట్లయితే ఆ వార్తలు మీడియా సృష్టి అని చెప్పి చల్లగా తప్పుకోవడానికి మార్గమూ ఉంటుంది. తానెక్కడా స్వయంగా పదవికి రాజీనామా చేస్తానని కానీ, తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా కానీ మాట్లాడలేదని ఆయన చెప్పుకోవడానికి అవసరమయిన మార్గాలన్నిటినీ ఆయన సిద్దంగా ఉంచుకొని ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. లేదంటే అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన ఆయన, న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను వెంటనే ఖండించాలని తెలియక ఊరుకోలేదు.
ఇక, ఆయన తెలంగాణా కోసమే తన మంత్రి పదవిని త్యాగం చేయడం అనేది కూడా పూర్తిగా నిజం కాదు. గతంలో కీలకమయిన పెట్రోలియం శాఖను నిర్వహించిన ఆయన రిలయన్స్ కంపెనీకి అడ్డం పడుతునందునే ఆయనను ఆశాఖ నుండి తప్పించి అప్రదాన్యమయిన పట్టణాభివృద్ధి శాఖకు పంపేసారు. అంతకు మునుపు ఎన్నడూ కూడా ఆయనలో కాంగ్రెస్ అధిష్టానం పట్ల అసమ్మతి కనబడలేదు. కానీ, తనకు కేంద్రంలో ప్రాధాన్యత తగ్గిన తరువాతనే ఆయనకు పార్టీ అధిష్టానం పట్ల ఆగ్రహంతో ఉన్నసంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఆయన చేప్పటిన మంత్రి పదవి ఆయనకు ఉన్నా ఊడినా ఒక్కటే గనుక, ఆయన ఆదేదో తెలంగాణా కోసమే త్యాగం చేస్తున్నట్లు చెప్పుకొంటే కనీసం రాష్ట్రంలోనయినా కొంచెం మంచి పేరు సంపాదించుకోవచ్చునని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. కానీ, త్వరలో ఎన్నికలు రానున్న ఈ సమయంలో ఆయనే కాదు, పార్టీలో ఎవరూ కూడా పార్టీ అధిష్టానాన్ని ఎదిరించలేరు. ఎదిరిస్తే టికెట్లు రావని జగమెరిగిన సత్యం.
రాహుల్ యువమంత్రం పటిస్తున్న ఈ సమయంలో ఇటువంటి సీనియర్లలో ఎంతమందికి పార్టీ టికెట్స్ దక్కుతాయో ఎవరికీ తెలియదు. గనుక, టికెట్స్ రావనే విషయం కూడా కూడా పూర్తిగా రూడీ చేసుకొన్నతరువాతనే, ‘తెలంగాణా కోసమే’ రాజీనామా చేస్తే తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం రెండు కూడా దక్కుతాయని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. అయినా, ప్రస్తుతం తెలంగాణా ఉద్యమాలు చేసేవారు ఇక్కడ చాలా మందే ఉన్నారు, గనుక అయన ఇప్పుడు వచ్చి కొత్తగా చేసేదేమీ ఉండదు.