రాను రానంటూనే షర్మిల..?
posted on Jul 3, 2023 @ 3:41PM
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీ కోసం, అన్న జగన్ వదిలిన బాణంగా ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఒక విధంగా అప్పట్లో జగన్ అరెస్టయిన సమయంలో పార్టీ పతనం కాకుండా షర్మిల నిలబెట్టారనే చెప్పాలి. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను ఆయన కూరలో కరివేపాకులా తీసేశారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా దూరం పెట్టారు. దీంతో షర్మిల ఏపీని వదిలి.. తెలంగాణలో తండ్రిపేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి రాజకీయంగా బిజీ అవ్వడానికి ప్రయత్నించారు.
ఆ క్రమంలో ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ల కంటే తీవ్రంగా దుమ్మెత్తి పోశారు. అయితే ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఎదురౌతున్న ప్రశ్న ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాలలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అన్నదే.
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. ఆమే జగనన్నను వదిలేశారో తెలియదు, కానీ, పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు.అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో,ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరకంగా ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె ఖండించినా ఆ ప్రచారం ఆగడం లేదు. అసలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం తరువాత నుంచే ప్రారంభమైంది. అందుకు ఆమె ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను స్వల్ప వ్యవధిలో మూడు సార్లు కలవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ వైపు అన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ కు కూడా వైఎస్సార్ బ్రాండ్ రూపంలో షర్మిలను చేర్చుకునేందుకు, ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీకి ఆమె సేవలు తెలంగాణలో అవసరం లేదన్న విషయంలో కాంగ్రెస్ స్పష్టంగా ఉంది. ఇక్కడే షర్మిల పార్టీ విలీనం విషయంలో జాప్యం జరుగుతోంది.
ఆమె ఏ కారణం చేత ఏపీ వదిలి వచ్చేసినా.. ఇప్పటికీ ఆమె ఏపీలో అన్న జగన్ కు ఎదురు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరతాను కానీ, తన కార్యక్షేత్రం మాత్రం తెలంగాణే కావాలని అంటున్నారు. ఈ విషయంలో ఆమె ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లైన జానా రెడ్డి వంటి వారిని కలిసి చర్చించారు. అయితే టీపీసీసీ చీఫ్ మాత్రం ఆమె తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలు పెట్టడానికి కూడా అంగీకరించేది లేదంటున్నారు. అదే సమయంలో బట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం బయటి పార్టీలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన వారు ఇప్పుడు పార్టీలో ఉండగా లేనిది షర్మిల వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం వైఎస్ బ్రాండ్ తెలంగాణలో పార్టీకి పెద్దగా ప్రయోజనకరం కాదనీ, షర్మిల సేవలు ఏపీలో అయితే అక్కడ పార్టీ బలోపేతమయ్యే అవకాశాలున్నాయని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆత్మగా అందరూ పేర్కొనే కేవీపీ రామచంద్రరావు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ గూటికి చేరితే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఖాయమని చెబుతున్నారు. అంతా సరే కానీ షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథిగా కీలక బాధ్యతలు చేపట్టాలన్న కాంగ్రెస్ కండీషన్ కు ఆమె అంగీకరిస్తారా? తెలంగాణను వీడనంటూ షర్మిల కండీషన్ ను కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.