చంద్రబాబుతో షర్మిల భేటీ.. జగన్ పుణ్యమేగా?
posted on Jan 13, 2024 @ 11:39AM
షర్మిల ప్రతి అడుగూ ఆమె సోదరుడు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీని ఓటమికి దగ్గర చేస్తోంది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికలలో అన్న విజయం కోసం శక్తికి మించి కృషి చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్న ఓటమి కోసం అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె తన జగనన్న బద్ధ శత్రువులగా భావించే వారిని స్వయంగా కలుస్తున్నారు. కలవబోతున్నారు కూడా. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గిఫ్ట్ పంపిన షర్మిల.. అంతకు కొద్ది రోజుల ముందే జరిగిన తన జగనన్న జన్మదినానికి కనీసం విషెస్ కూడా చెప్పలేదు. ఇప్పుడు తాజాగా షర్మిల శనివారం (జనవరి 13) స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
ఈ భేటీకి కారణం షర్మిల కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికే అయినా.. వారి మధ్య రాజకీయ చర్చలు జరిగాయనడంలో సందేహం లేదు. కొద్ది రోజుల ముందు షర్మిల తన కుమారుడి మేనమామ అయిన జగన్ కు కూడా తాడేపల్లి నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించి వచ్చారు. ఆ సమయంలో ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. అయితే ఆ సందర్భంగా అన్నా చెల్లెళ్ల మధ్య ముభావమే రాజ్యమేలిందని విశ్వసనీయ సమాచారం. అన్న కానీ, వదిన కానీ ఆమెను సాదరంగా ఆహ్వానించలేదనీ చెబుతారు. మొత్తం మీద తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ఆమె తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి బయటకు వచ్చేయడానికి పాతిక నిముషాల సమయం కూడా పట్టలేదు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తన సోదరుడు జగన్ హార్ట్ ఫుల్ గా రిసీవ్ చేసుకోలేదన్నట్లుగానే మాట్లాడారు. నేరుగా ఆ విషయం చెప్పకపోయినప్పటికీ లోపల ఏంజరిగిందన్నది చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు. విజయమ్మ సైతం మౌనంగానే ఉన్నారు. ఇది జరిగిన తరువాత జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లిన జగన్ పనిలో పనిగా లోటస్ పాండ్ లోని షర్మిల నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మను కలిసి వచ్చారు. ఆ సమయంలో షర్మిల హస్తిన పర్యటనలో ఉన్నారు. తల్లితో జగన్ ఏం మాట్లాడారన్నది బయటకు రాకపోయినా.. పరిశీలకులు మాత్రం షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరవద్దని తల్లికి గట్టిగా చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద జగన్ కు తల్లితో, చెల్లితో సత్సంబంధాలు లేవన్నది మాత్రం గత రెండున్నర మూడేళ్లుగా అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే షర్మిల తొలత తెలంగాణకు వలస వెళ్లి తండ్రి ఆశయసాధన కోసం అంటూ అక్కడ వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తన రాజకీయం తను చేసుకుంటూ పోయారు. కొద్ది రోజులకే తల్లి విజయమ్మ కూడా వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కూతురి వద్దకు వచ్చేశారు. అప్పటి నుంచీ తల్లీ, చెల్లితో జగన్ అంటీముట్టనట్టుగానే ఉన్నారు. చివరికి ఇడుపుల పాయలో జరిగే వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో కూడా ముభావంగానే మెలిగారు. సరే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించడానికి రెడీ అయిపోయిన తరువాత మాత్రం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు. బంధువులు, కుటుంబ సన్నిహితుల ద్వారా షర్మిలకు రాయబారాలు, రాయబేరాలు పంపినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తెగేసి చెప్పారని అంటున్నారు.
ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటంతో జగన్ లో అసహనం తారస్థాయికి చేరిందని.. షర్మిల కాంగ్రెస్ చేరిక వెనుక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్న చంద్రబాబు కుట్రలు ఉన్నాయంటూ ఆయన చేసిన విమర్శలే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే షర్మిలకు తన కుమారుడి వివాహం జగన్ రెడ్డిని మరింత ఇరుకున పెట్టడానికీ, మరింత అసహనానికి గురి చేయడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతోందని చెప్పవచ్చు. తెలంగాణలో తన వైఎస్సార్టీపీ పార్టీని నడిపించేందుకు అవసరమైన ఆర్థిక, హార్థిక, నైతిక సహాయం అందకుండా అడ్డుపడిన జగన్ కు ఇప్పుడు ఆమె పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తన కుమారుడి వివాహ వేడుక అందివచ్చిన అవకాశంగా మారింది. ఇప్పుడు వైఎస్ షర్మిల తన కుమారుడుని వెంటబెట్టుకొని శ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి శుభలేఖ అందించారు. చంద్రబాబును కలవడం చాలా చాలా ఆనందంగా ఉందని ఆ వెంటనే మీడియాకు చెప్పారు. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత చంద్రబాబుతో భేటీ కావడం ఇదే తొలిసారి. కనుక సహజంగానే వారిరువురి మధ్యా రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరుగుతుంది. ముందు ముందు ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సైతం భేటీ అవుతారు. ఆయనను కూడా తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తారు. అప్పుడు కూడా ఆయనతో రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు. అందులో సందేహం లేదు. అందుకే తన కుటుంబాన్ని చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కానీ నిజానికి తన కుటుంబాన్ని చీల్చుకుని షర్మిలకు కాంగ్రెస్ పంచన చేరడం వినా మార్గం లేకుండా చేసింది స్వయంగా జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు షర్మిల చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు దారి చూపింది కూడా జగన్ పుణ్యమేనని ఎద్దేవా చేస్తున్నారు.