ఇది దేవుడి నిర్ణయం.. అద్వానీ నిర్వేదం
posted on Jan 13, 2024 @ 10:06AM
కష్టే ఫలీ అంటారు. కానీ కష్టం అంతా పడి ఫలితం మరొకరి ఖాతాలో పడుతుంటే ఆ కష్టపడిన వారికి బాధ, ఆవేదన సహజం. ప్రస్తుతం మాజీ ఉపప్రధాని, బీజేపీ సీనియర్ నాయకుడు, నాడు రామమందిర నిర్మాణం కోసం దేశం మొత్తాన్నీ తన రథ యాత్రతో కదిలించిన నేత ఎల్ కే అద్వానీ అలాంటి నిర్వేదంలోనే ఉన్నారు.
రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర సాగించి దేశంలో ఇటు రామభక్తిని, అటు బీజేపీ బలాన్నీ పెంచిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ ఇప్పుడు తన కష్టం కారణంగా అంకురార్పణ జరిగి, నిర్మాణం పూర్తి చేసుకున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలలో కేవలం అతిథిగా మాత్రమే అద్వానీ ఉన్నారు.
దీనిపై ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలే ఇది దేవుడి నిర్ణయం మనమేం చేయలేమని నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకే ఆ రాముడు ఆలయ నిర్మాణ కర్తగా ఎంచుకున్నాడని, తాను కేవలం రథసారథిని మాత్రమేనని అన్నారు.
తాను రామ మందిరం కోసం రథయాత్ర చేశారనీ, అప్పుడే ఏదో ఒక రోజున అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని తాను భావించాననీ, తన కల, ఆశ, ఆశయం ఇప్పుడు నెరవేరిందని అద్వానీ చెప్పారు.
అయోధ్యలో ఆలయం నిర్మించడం విధి నిర్ణయం. దేవుడి ఆదేశం అన్న అద్వానీ.. తన రాజకీయ జీవితంలో అయోధ్య రథయాత్ర ఒక బృహత్తర ఘటన అన్నారు. రాముడిపై భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో తాను 1990లో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని, జనం రామమందిర నిర్మాణం కోసం ఉప్పెనలా కదులుతారనీ తాను అప్పుడు ఊహించలేదన్నారు. రథయాత్ర సమయంలో మోడీ కూడా తన వెంటే ఉన్నారని చెప్పారు.
అయితే అప్పుడుతనవెన్నంటి ఉండి, అడుగడుగునా ప్రోత్సాహాన్ని, సేహ హస్తాన్నీ అందించిన మాజీ ప్రధాని వాజ్ పేయి, ఇప్పుడు లేకపోవడం మాత్రం చాలా బాధ కలిగిస్తోందని అద్వానీ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తాను చేసిన రాజకీయ యాత్ర మొత్తం భావోద్వేగాపూరితంగా జరిగిందన్నారు. అయోధ్యలో అంటే రామజన్మభూమిలో రామ మందిరం నిర్మాణం ప్రజల బలమైన ఆకాంక్ష అన్న అద్వానీ ఆ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.