ఓడిపోలేదు..ఓడించారు.. కేటీఆర్ వింత వాదం!
posted on Jan 13, 2024 @ 1:58PM
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాట, తీరు అంతా కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేదనేలాగే ఉంది. ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడానికీ, వాస్తవాలు అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేరని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారంలో ఉన్న బీఆర్ ఎష్ కు విపక్ష పాత్ర పోషించడం ఎలా అన్నది తెలియడం లేదని, కింద పడ్డా పైచేయి మాదేనన్నట్లుగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఉందని అంటున్నారు. ఓసారి యూట్యూబర్లని, మరోసారి సాధించిన ప్రగతిని, అందించిన సంక్షేమాన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యామనీ చెబుతున్నారే తప్ప ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ప్రజలు తమను తిరస్కరించారని అంగీకరించలేకపోయారు. ఓటమి కారణాలను సరిగ్గా తెలుసుకోగలిగితేనే, ప్రజల ముందు పొరపాట్లను అంగీకరించి తదుపరి ఎన్నికలలోనైనా మరో అవకాశం ఇవ్వండి అని కోరడానికి చాన్స్ ఉంటుంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసిందని, అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించడం వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.
ఎన్నిక ఏదైనా, ఎక్కడైనా విజయం మాదే అంటూ అధికారంలో ఉన్న సమయంలో చెప్పిన మాటలు, కాంగ్రెస్ ఉనికే లేదంటూ చేసిన విమర్శలను ఇంత త్వరగా ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ భావించడం అహంకారం అహంభావం వినా మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. అసలు కేటీఆర్ రాజకీయ అరంగేట్రం తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు జరిగింది. అంతకు ముందు ఆయనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. అందుకే ఇలా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అలా ఎన్నికలలో గెలిచి మంత్రి అయిపోయారు. అందుకే ఆయనకు ఎన్నికలలో అపజయాలు ఉంటాయన్న విషయమే ఎరుకలేదు. రాజకీయం అంటే అధికారమే అన్న భ్రమలోనే ఇప్పటికీ ఉన్నారు.
అందుకే ఓటమి రియాలిటీని ఆయన గుర్తించడం లేదు. కానీ విజయం సాధించినప్పుడు విజయం ఎందుకు అన్నది పెద్దదగా పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ.. అపజయం విషయంలో మాత్రం ఆత్మ విమర్శ, కారణాలపై సమీక్ష అనివార్యం. అధికారంలో ఉండగా మేం చెబుతాం.. మీరు వినండి అన్న వైఖరిని అవలంబించి కేటీఆర్.. ఇప్పుడు పరాజయం పాలైన తరువాత కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి పూర్తిగా నెలరోజులు అయ్యిందో లేదో హామీలను అమలు చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వ్యవధి తీసుకుంటామని ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పింది. ఆ గడువు ముగియకుండానే వాగ్దానాల అమలులో విఫలం అంటూ నిందలు వేస్తే.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ అమలు చేయని వాగ్దానాలు ఇవీ అంటే ప్రజలే కొండవీటి చాంతాడంత జాబితాను చదువుతున్నారు.
వాస్తవానికి సాధ్యాసాధ్యాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా హామీల వర్షం కురిపించేసి, తరువాత వాటి ఊసే ఎత్తకుండా తొమ్మిదేళ్ల పాటు అధికార బండిని లాగించేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలిస్తే వాగ్దానాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకింత చిత్తశుద్ధినే ప్రదర్శిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి,, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళిత నేత వంటి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆయన అధాకరంలో ఉన్నంత కాలం అమలు కోసం ఇసుమంతైనా ప్రయత్నం కూడా చేయలేదు. ఆ హామీల అమలుపై జనం ప్రశ్నించకుండా, మరిన్ని హామీలు, కొత్త పథకాల ప్రచారాన్ని ఆర్భాటంగా ప్రారంభించేస్తూ తమ్మిదేళ్ల పాటు ప్రచారం, ఆర్భాటమే పాలనగా సాగించిన ఫలతమే ఇప్పుడీ పరాజయం అన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటికైనా ఓటమిపై సమీక్ష జరుపుకుని , ఆత్మ విమర్శ చేసుకోకుండా ఇప్పటికీ ఎదురుదాడే మా విధానం అన్నట్లుగా వ్యవహరిస్తే మరో పరాజయ పరాభవానికి బీఆర్ఎస్ సిద్ధం కావాల్సి ఉటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.