సుఖం ఎక్కువైతే..దుఖమే
posted on May 27, 2021 @ 9:30AM
సెక్స్..మానవజాతి తన గమనాన్ని కొనసాగించేందుకు సృష్టి ఇచ్చిన అద్భుతమైన వరం. కేవలం పిల్లల్నికనడానికే కాదు..రెండు శరీరాలకు సాంత్వన కలిగించే క్రియ ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా..ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నింటిని చిత్తు చేసే శక్తి సెక్స్‌కు ఉంది. అందుకే భారతీయులు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. లైంగిక వాంఛ అన్నది ప్రతి మనిషిలోనూ అత్యంత సహజంగా ఉండే భావన. ఇది జీవితంలోని తృప్తికీ, గాఢమైన అనుభూతికీ, మరెన్నో భావోద్వేగాలకూ కీలకమైన కేంద్రం. అందుకే మన పురాణాల్లోనూ..దేవాలయ శిల్పాలుగానూ రతి అన్నదానిని చేర్చారు మన పెద్దలు. కాలంతో పాటే ఈ ప్రక్రియలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి.
నాలుగు గదుల మధ్యలో సాగే వ్యవహారాన్ని..నలుగురికి తెలిసేంతగా బరితెగిస్తోంది నేటీ తరం..అతి ఎక్కడైనా పనికిరాదు అన్నట్లు విచ్చలవిడి శృంగారం వల్ల చేటు తప్పదు. ఆ తప్పుకు శిక్షగా సుఖవ్యాధులు మానవాళిని కబలిస్తున్నాయి. అయితే కాలంతో పాటే సుఖవ్యాధుల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా, షాంక్రాయిడ్ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కనిబెట్టిన తర్వాత సుఖవ్యాధులను జయించవచ్చని మనిషి సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి.
ఒకప్పుడు యాంటీబయోటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏ మాత్రం లొంగకుండా..మొండిగా తయారవుతున్నాయి. శరీర నిర్మాణపరంగా పురుషులకంటే స్త్రీలకే సహజంగా సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే లక్షణాలేవి కనబడకపోవచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదముంది. కొన్ని రకాల సుఖవ్యాధుల బారిన పడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 20 ఏళ్లకే యువతీయువకులు సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ వంటి వ్యవహారాల వల్ల ఒకరి కంటే ఎక్కువ మందితో అసురక్షిత శృంగారంలో పాల్గొని సుఖవ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.
ఇక్కడ శృంగారం అంటే సంభోగమే కాదు. ముద్దులు ఇతర లైంగిక చర్యలు కూడా శృంగారం కిందకే వస్తాయి. చాలా మంది వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ..నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ లోలోపల తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇలాంటి వారి జీవితం నరకం కావడమే కాకుండా..వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి. అందుకే సుఖవ్యాధులు దరిచేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించడం ఒక్కటే సరైన మార్గం.
* తెలిసీ తెలియక లైంగిక ప్రయోగాలకు దిగవద్దు.
* నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచింది.
* అపరిచితులతో సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ ధరించాలి
* శృంగారంలో అసహజ పద్ధతులకు దూరంగా ఉండాలి.