డీఎన్‌ఏలో మార్పుతో రోగాలన్నీ దూరం


ఇప్పుడు శరీరానికి కూడా కావల్సినన్ని మరమ్మతులు చేయవచ్చునని ఓ పరిశోధన రుజువు చేస్తోంది.

 

డీఎన్‌ఏ ఎడిటింగ్‌

మన శరీరంలో ప్రతి కణాన్నీ కూడా అందులో ఉండే డీఎన్ఏ శాసిస్తుందనే విషయం తెలిసిందే! కాబట్టి ఏదన్నా అవయవం దెబ్బతిన్నదంటే ఆ అవయవ నిర్మాణంలో ముఖ్యమైన డీఎన్‌ఏ కూడా దెబ్బతిన్నట్లు లెక్క. అందుకనే ఒక వ్యక్తి డీఎన్ఏలో తగిన మార్పులు చేయడం ద్వారా అతనికి మళ్లీ ఆరోగ్యాన్ని కలిగించే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అందులో ఓ ముఖ్యమైన ప్రయత్నమే డీఎన్‌ఏ ఎడిటింగ్. ఇందులో ఇప్పటికే Crispr-Cas9 అనే తరహా చికిత్స దాదాపు అందుబాటులోకి వచ్చేసింది. చైనా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ఉపయోగించి క్యాన్సర్‌ను సైతం నయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. Crispr-Cas9 చికిత్సలో భాగంగా కొన్ని మార్పులు చేసిన కణాలను శరీరంలోకి ప్రవేశపెడతారు. అవి డీఎన్ఏలోని హానికారకమైన భాగాలను తొలగించే కత్తెరలా ఉపయోగపడతాయట. మొండి క్యాన్సర్లను సైతం నిర్మూలించడంలో ఈ ప్రక్రియ అమోఘంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 

మరో అడుగు

చైనా శాస్త్రవేత్తలు కృషి ఇలా ఉండగా, మరో పక్క అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు అసలు ఏకంగా డీఎన్‌ఏలో తెగిపోయిన భాగాలను అతికించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఈ విధానం కేవలం చర్మం, జీర్ణవ్యవస్థ వంటి చిన్ని చిన్న అవయవాలకే పరిమితం అయ్యేది. ఎందుకంటే అక్కడి కణాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. కానీ మెదడు, కళ్లు, కాలేయం, గుండె వంటి అవయవాలు దెబ్బతింటే వాటిలోని డీఎన్ఏ మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టం. అందుకోసం ఇప్పుడు  అమెరికాకు చెందిన పరిశోధకులు మరో తరహా డీఎన్‌ఏ ఎడిటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదన్నా ముఖ్యమైన అవయవం దెబ్బతింటే, అందులోని డీఎన్ఏను మళ్లీ సరిదిద్దేందుకు, డీఎన్‌ఏల మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి సరిచేసేందుకు రోగి శరీరంలోకి సరికొత్త కణాలను ప్రవేశపెడతారు. ఈ తరహా చికిత్సను HITI టెక్నాలజీ అంటున్నారు.

 

ఫలితాలు మొదలయ్యాయి

HITI టెక్నాలజీ ద్వారా ఇప్పటికే అంధత్వం వచ్చిన ఎలుకలలో మళ్లీ చూపుని తీసుకువచ్చారు. మున్ముందు ఈ సాంకేతికను మరింత అభివృద్ధి చేయగలిగితే ఎలాంటి రోగాన్నైనా నివారించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, మనలో వృద్ధాప్యం వచ్చేందుకు డీఎన్ఏలో వచ్చే మార్పులే కారణం కదా! కాబట్టి, డీఎన్‌ఏలో తగిన మార్పుని తీసుకురావడం ద్వారా వృద్ధాప్యాన్ని కూడా వాయిదా వేయవచ్చునంటున్నారు.

 

- నిర్జర.