పొగ తాగితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది!

 

‘పాగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అన్న మాట అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటుంది. సిగిరెట్లు ఊదేయడం వల్ల  ఎన్నెన్ని సమస్యలు వస్తాయో చెబుతూ బోలెడు పరిశోధనలు వెలువడుతూ ఉంటాయి. కానీ క్యాన్సర్‌కీ సిగిరెట్లకీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ఓ కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది.

 

 

డీఎన్‌ఏ మారిపోతుంది

ఇంగ్లండ్‌, అమెరికాలకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 5000 క్యాన్సర్‌ కణితుల పరిశీలించారు. రోజుకి ఒక పెట్టె సిగిరెట్లు తాగేవారి ఊపిరితిత్తులలోని కణాలు దెబ్బతింటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. సిగిరెట్ పొగకి ఈ కణాలలోని డీఎన్ఏలో సమూలమైన మార్పులు (mutation) కనిపించాయి. ఇలా డీఎన్‌ఏలో మార్పులు రావడమే క్యాన్సర్‌ దాడి చేసేందుకు ఆస్కారం ఇస్తుందట. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు... ఏడాదిలో 150 సార్లు ఇలా కణాల డీఎన్‌లలలో మార్పులు రావడాన్ని పరిశోధకులు గమనించారు. అంటే 150 రెట్లు క్యాన్సర్‌ కణితిలు ఏర్పడే ప్రమాదం ఉందన్నమాట. ఇక పొగరాయుళ్ల స్వరపేటికలో ఏడాదికి 97 సార్లు, నోటిలో 23 సార్లు... అక్కడి కణాలలో డీఎన్ఏ మార్పులు కనిపించాయి.

 

 

ఊపిరితిత్తులే కాదు

ఇప్పటివరకూ సిగిరెట్లలోని రసాయనాలు ఊపిరితిత్తులు, నోరు, స్వరపేటిక వంటి అవయవాల మీదే ప్రభావం చూపుతాయని అనుకునేవారు. ఎందుకంటే సిగిరెట్లలోని పొగ నేరుగా వాటికి తగులుతూ ఉంటుంది కాబట్టి. కానీ మూత్రాశయం, కాలేయం వంటి అవయవాలలో కూడా సిగిరెట్‌ ప్రభావం ఉండటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. రోజుకి ఓ పెట్టె సిగిరెట్ తాగినవారిలో ఏడాది గడిచేసరికి మూత్రాశయంలోని కణాలలో 18 సార్లు డీఎన్‌ఏ మార్పులు జరిగాయట. ఇక కాలేయంలో ఓ 6 సందర్భాలలో ఇలాంటి ప్రభావం కనిపించింది. దీంతో సిగిరెట్ల వల్ల దాదాపు 17 రకాల క్యాన్సర్లు వ్యాపించే ప్రమాదం ఉందన్న వాదనలకి ఈ పరిశోధన బలం చేకూరుస్తోంది.

 

 

కార్సినోజెన్లే కారణం

క్యాన్సర్‌ను ప్రేరేపించే రసాయనాలను కార్సినోజెన్‌లు అంటారు. ఇవి మన చుట్టుపక్కల ఒకటో రెండో ఉంటేనే ప్రమాదం. అలాంటిది నేరుగా నోట్లోకి పీల్చుకునే సిగిరెట్‌ పొగలో 50కి పైగా  కార్సినోజెన్‌ రసాయనాలు ఉంటాయి. ఇవే కాకుండా 400కు పైగా ఇతర హానికారక రసాయనాలు ఉంటాయి. మొత్తంగా దాదాపు 5000 రకాల రసాయనాలు ఒక్క సిగిరెట్లో ఇమిడి ఉంటాయి. మరి ఇన్ని ఉన్నాక అవి క్యాన్సర్‌కు దారితీయక ఏం చేస్తాయి!

 

జోలికే పోవద్దు

ఇప్పటికే సిగిరెట్‌ అలవాటు ఉంటే దానిని మానుకోవడం మంచిదే. కానీ అసలు దాని జోలికే పోకపోవడం మరింత మేలంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే కొన్నాళ్లపాటు విపరీతంగా సిగిరెట్లు కాల్చి ఆ తరువాత మానేసినా, దాని ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. ఇప్పటికే పొగాకు వల్ల ఏటా కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారని WHO వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. జనం కనుక ఇలాగే సిగిరెట్లని అంటిపెట్టుకుని ఉంటే భవిష్యత్తులో ఈ సంఖ్య కోట్లలో ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

 

 

- నిర్జర.