కాంగ్రెస్ అధ్యక్ష రేసులో కొత్త పేరు శశిథరూర్
posted on Aug 30, 2022 @ 11:06AM
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో ఇంత వరకూ సుముఖత చూపలేదు సరికదా.. తమ కుటుంబానికి చెందని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్న తన పాత మాటకే కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. అయితే సోనియా గాంధీ మాత్రం తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. తన బిడ్డలిద్దరిలో ఆమె రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ను ఖరారు చేసేశారు. మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలైతే రాహులే తమ నాయకుడనీ, ఆయనకు ప్రత్యామ్నాయం లేదనీ అంటున్నారు.
ఇక రాహుల్ అంగీకరించకపోతే.. అశోక్ గెహ్లాట్ కు పగ్గాలు అప్పగించాలని సోనియా భావించినా.. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పటి వరకూ రేస్ లో లేని శశిథరూర్ పేరు తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన పోటీ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో సంస్థాగత సంస్కరణలు అనివార్యం అంటూ రెండేళ్ల కిందట పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన జీ23 నేతలలో ఎంపీ శశిథరూర్ కూడా ఒకరు. తాజాగా ఒక మళయాళ పత్రికకు రాసిన వ్యాసంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఒక్క అధ్యక్ష స్థానానికే కాకుండా సీడబ్ల్యుసీలో ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం చాలా అవసరమని ఆ ఎన్నికే పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి నాంది అవుతుందని శశిథరూర్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 22న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. అదే నెల 19న ఫలితం వెలువడుతుంది. కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకూ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.
తొలి సారి 1997లో జరిగాయి. ఆ ఎన్నికలో శరద్ పవార్, రాజేష్ పైలట్, సీతారాం కేసరిలో పోటీ చేశారు. సీతారాం కేసరి విజయం సాధించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలో జితేంద్రప్రసాదర్ సోనియాగాంధీపై పోటీ చేశారు. ఆ ఎన్నికలో సోనియా గాంధీ ఘనమైన మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికలో సోనియా గాంధీకి 7448 ఓట్లు వచ్చాయి. జితేంద్రప్రసాద్ కు కేవలం 94 ఓట్లు వచ్చాయి.
అయితే ఈ సారి మాత్రం పోటీ జరిగితే గతానికి భిన్నమైన పరిస్థితి ఉంటుందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ సారి ఎన్నికలలో తాను రంగంలో ఉంటానని శశిథరూర్ తన వ్యాసం ద్వారా చెప్పకనే చెప్పారు. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికే పార్టీ అధ్యక్ష పదవి అన్నది అనివార్యమైతే పోటీలో ఉండే వారి సంఖ్య బారీగానే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.