సీపీఎస్ రద్దుచేయాలి.. 1న నిరసనలకు ఉపాధ్యాయుల హెచ్చరిక
posted on Aug 30, 2022 @ 11:09AM
పాలనతో ప్రజల్ని ఆకట్టుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను మరింత ఇబ్బందిపెడుతూ, అవమానాలకు గురిచేయడంవల్ల సాధించేదేమీ ఉండదు. ఏపీలో ఉపాధ్యాయులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణమని విశ్లేషకులు అంటున్నారు. మామూలు ఉపాధ్యాయులను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధించడం మరీ దారుణమని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు.
తాము సీపీఎస్ రద్దు కోసం నిలబడి తీరుతామని ఉపాధ్యాయుల నాయకులు స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని ప్రకటించారు. జిల్లా స్థాయి లోనూ, మండల స్థాయిల్లోనూ తమ నిరసనలు ఉంటాయన్నారు. ఉపాధ్యాయుల్ని నిర్బంధిస్తే కుటుంబ సభ్యులతో ఆందోళనలు చేయిస్తా మని బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకూడదన్న శాసనం అర్ధంలేనిది. ప్రశ్నించినవారిని రాజకీయదాడికి పాల్పడుతున్నారంటూ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం ఎంతవరకూ సబబు అని ఎమ్మెల్సీ వి. బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహిం చారు.
ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు నమోదు చేయడం పై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు. హక్కుల కోసం నిరసన తెలుపుతుంటే కక్షసాధింపు చర్యలకు దిగటం దుర్మార్గమని అన్నా రు. ఉపాధ్యాయులు పండుగ చేసుకోరాదని, అసలు బడికే వెళ్లవద్దని పోలీసు స్టేషన్లకు పిలిపించడం అనై తికమని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల శ్రేయస్సుకీ కంకణం కట్టుకుని ఉందని ముందు భారీ ప్రచారాలు చేసుకున్న జగన్ ప్రభుత్వం తీరా మూడేళ్ల తర్వాత అసలు రంగు బయటపెట్టారని విమర్శకులు అంటున్నారు. సిసిఎస్ రద్దుకోసం నిలబడతారా, ప్రాణాలు తీసుకుంటారా అనే సందేశాన్ని కిందిస్థాయి ఉద్యోగుల వరకూ ప్రభుత్వమే పంపిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలు అన్నారు. ఇంతకంటే ప్రభుత్వం వేరే దారుణమేమీ చేయలేదని ఆరోపించారు.
స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ, బ్రిటీష్ కాలంలో కూడా ఈ తరహా నిర్బంధాలు ఉద్యోగులు ఎదుర్కోలేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే అడుగుతున్నామని అన్నారు. ఎన్నికల హామీలో పెట్టకుండానే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేశాయని గుర్తుచేశారు. కాగా, సీపీఎస్ రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీ రఘువర్మ హెచ్చరించారు. లక్షన్నర ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబాల ఓట్లు తమతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల వెంట ఉద్య మిస్తామని స్పష్టం చేశారు.