ప్రభుత్వ సహకారంతోనే.. ఓటు కోసం హైకోర్టుకు?
posted on Mar 31, 2021 @ 11:15AM
ఏపీలో స్థానిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదు. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించాం. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. మార్చి 31తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయన్నారు నిమ్మగడ్డ.
ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు.
ఇక తన ఓటు హక్కుపై చెలరేగిన దుమారంపైనా స్పందించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదని.. పదవీ విరమణ తర్వాత ఒక పౌరుడిగా తన హక్కు సాధించుకోడానికి వెనకాడనన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.