తమిళిసై నియామకం కేసీఆర్‌కు ఇష్టం లేదా? మరి ఆ ఆర్టికల్ రాయించిందెవరు?
posted on Sep 11, 2019 @ 10:46AM
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసైపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైపోయింది. తమిళిసై ప్రమాణస్వీకారం చేసిన రోజే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం దీనికి కేంద్రమైంది. సర్కారియా కమిషన్ సిపార్సులను ఊటంకిస్తూ రాసిన వ్యాసంలో... తమిళిసై నియామకంపై పరోక్షంగా టీఆర్ఎస్ సర్కారు అయిష్టతను బయటపెట్టిందనే మాట వినిపిస్తోంది. ఎక్కడా తమిళిసై పేరు ఎత్తకుండా రాసిన ఈ వ్యాసంలో... రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను గవర్నర్లగా నియమించకూడదనే సర్కారియా కమిషన్ సిఫార్సులను ప్రస్తావించారు. గవర్నర్ వ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందంటూ సీఎం కేసీఆర్ సీపీఆర్వో విశ్లేషణ సాగింది. అయితే సీఎం సీపీఆర్వో ఆర్టికల్ పై బీజేపీ మండిపడుతోంది. అసలు సర్కారియా కమిషన్ సిఫార్సులు ఎక్కడ అతిక్రమించామో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు గవర్నర్ ను గౌరవిస్తామని చెబుతూనే, మరోవైపు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా వ్యాసాలు రాయించడమేంటని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా సీఎం సీపీఆర్వో... రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ పై అనుమానాలు, అపోహలు ఉన్నాయంటూ, ఆర్టికల్ రాసే స్వేచ్ఛ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆర్టికల్ రాసిన వ్యక్తికి సర్కారియా కమిషన్ సిఫార్సులు గురించి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తోన్న బీజేపీ... సీపీఆర్వోను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ పై అనుచిత ఆర్టికల్ రాసిన సీఎం సీపీఆర్వోపై చర్యలు తీసుకోకపోతే, క్రిమినల్ కేసు పెడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అయినా, గవర్నర్‌గా బాధ్యతలు తీసుకుని 24గంటలు కూడా గడవకముందే ఇలా విషం కక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు.
అయితే, గవర్నర్ల నియామకం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని, దాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ గా తమిళిసైకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్న కేటీఆర్... ఆమె మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. మరోవైపు మిగతా గవర్నర్లకు భిన్నంగా బాధ్యతలు స్వీకరించినరోజే తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తమిళిసై... కేసీఆర్ పరిపాలనను, అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రశంసించారు. బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంతో ఉందంటూ వ్యాఖ్యానించారు.
మొత్తానికి, తెలంగాణకు కొత్త గవర్నర్ రాక సందర్భంగా, సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, రాజకీయ కోణంలోనే తమిళిసైని తెలంగాణకు గవర్నర్ గా పంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో, ఆమె నియామకం.... సీఎం కేసీఆర్ కు కూడా ఇష్టం లేదనే చర్చ నడుస్తోంది. మరి ముందుముందు ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.