పల్నాటి యుద్ధం... వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బాబు వార్నింగ్
posted on Sep 10, 2019 @ 11:02AM
పల్నాడు పేరు చెబితేనే పగలు ప్రతీకారాలు గుర్తుకొస్తాయి. దాడులు ప్రతిదాడులు కామన్ గా కనిపిస్తాయి. ఇక అధికారం మారినప్పుడల్లా పరిస్థితులూ మారిపోతాయి. అందుకే, ఇప్పుడు పల్నాడులో కొత్త యుద్ధం నడుస్తోంది. ఆనాటి పల్నాటి యుద్ధాన్ని తలపించేలా అధికార వైసీపీ... ప్రతిపక్ష టీడీపీ... కత్తులు దూసుకుంటున్నాయి. రాజకీయ దాడులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిప్పులు కక్కుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... గూండాయిజం పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే... టీడీపీ వాళ్లే దాడులు చేస్తూ... తిరిగి వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది.
పల్నాడులో రాజకీయ దాడుల బాధితుల కోసం పునరావాస శిబిరం ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ వంద రోజుల పాలనలో ఐదు వందలకు పైగా దాడులు జరిగాయని, పది మందిని చంపేశారని ఆరోపించారు. ఇదే తరహాలో దాడులు కొనసాగిస్తే, భవిష్యత్తులో అంతకంతకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇక నారా లోకేష్ కూడా రాజకీయ దాడులపై నిప్పులు చెరిగారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని రాక్షస పాలన తెచ్చారంటూ మండిపడ్డారు. అయితే, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, తప్పుడు కేసులు పెడుతూ తమ కార్యకర్తలను ఊరు వదిలిపెళ్లిపోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
అయితే, తెలుగుదేశం ఆరోపణలపై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించొద్దని సూచించారు. పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తోందన్న సుచరిత... అసలక్కడ నిజంగా బాధితులు ఉన్నారో లేదో తెలుసుకునేందుకు నిజనిర్ధారణతోపాటు సమగ్ర విచారణ చేపడతామని ప్రకటించారు. ఒకవేళ పునరావాస కేంద్రాల్లో నిజంగానే బాధితులు ఉంటే, పోలీసులే వారిని స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లి...రక్షణ కల్పిస్తారని హోంమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, టీడీపీ ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని, ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.