Read more!

బీఆర్ఎస్ విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ!?

భారత్ రాష్ట్ర సమితి.. తెలంగాణకే పరిమితమైన జాతీయ పార్టీ. ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన ఉద్యమ నేత. ఎనిమిదేళ్ల పాటు కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన తన పార్టీ పేరును మార్చి ఆ పేరులోని తెలంగాణను తొలగించి భారత్ ను చేర్చి ఇక నుంచి తమది జాతీయ పార్టీ అని ప్రకటించేశారు. అంతే కాదు.. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే తమ పార్టీ ధ్యేయమని  ఉద్ఘాటించారు.

అయితే ఇంత వరకూ సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వినా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీ కాలూనలేదు.  తెరాస జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత కేసీఆర్ కు వరుస చిక్కులే ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలేవీ కనిపించకపోవడం,  జాతీయ పార్టీ ప్రకటనకు ముందు కూడా ఉన్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఆ తరువాత దూరం జరగడంతో అసలు బీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టి కీలకంగా ఎదగగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. అటువంటి తరుణంలో ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళిక రెడీ చేశార్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఆ పార్టీ అడుగుపెట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలలోనూ, అలాగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ పోటీకి దిగి ఉనికి చాటాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నాయి.  

ఆయా రాష్ట్రాలలో పార్టీ ఇన్ చార్జిల నియామకంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేతలే చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ చార్జిల నియామకంపై కేసీఆర్ పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారంటున్నారు.  మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో బీఆర్ఎస్ కాలూనేందుకు ఇదే మంచి తరుణం అని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.  మహా లోకల్ బాడీ ఎన్నికలలోనూ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాలతో బీఆర్ఎస్ సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్  మహారాష్ట్రలోని కాందార్‌లోహ సభలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  

తెలంగాణ ఎమ్మెల్సీ, తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలను పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఒక అవకాశంగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు.  త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని స్థానాలలో (తెలుగువారు అధికంగా ఉన్న స్థానాలను ఎంచుకొని) పోటీ చేసి విజయంతో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కలిసి వచ్చినా రాకున్నా ముందుకు సాగాలన్న నిర్ణయంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. కర్నాటకలో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతుందన్నది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.