Read more!

టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సొంత పార్టీ.. మరి బీఆర్ఎస్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కుంటున్నారా? ఆయన ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోందా?  ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయా? అంటే అవుననే అనవలసి వస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. నో.. నో ... మనం ఇప్పడు మాట్లాడుకుంటోంది ఉగాది పంచాంగంలో వివరించిన ముఖ్యమంత్రి జాతకచక్రం, గ్రహ స్థితులు, కష్టాలు నష్టాల  గురించి కాదు. క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీఆర్ఎస్  అనే సంకేతాలే స్పష్టంవుతున్నాయన్న దానిపైనే.

నిజానికి 2014 తర్వాత చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా,  తెరాసకు (అదే పేరుతో ఉన్నంత వరకు) కేసీఆర్  నాయకత్వానికి ఎదురన్నదే లేదు.  ఆయన భయపడిన, డిఫెన్స్ లో పడిన  సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ  ఇప్పడు అంటే తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ లో బెరుకుదనం బయట పడుతోంది., ఒక విధమైన భయం తొంగిచూస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల వరకూ అవసరం లేదు.. ఆయనలో తడబాటు, బెరుకు సామాన్యులకు కూడా అర్థమయ్యేలానే ఉన్నాయి.

ముఖ్యంగా, మంచైనా చెడైనా టీఆర్ఎస్) మన పార్టీ, మన తెలంగాణ పార్టీ, కేసీఆర్ మన నాయకుడు అని నమ్మి తొమ్మిదేళ్ళుగా కేసీఆర్ కు అండగా నిలిచిన తెలంగాణ వాదులు, పార్టీ క్యాడర్, అభిమానుల ఆలోచనలలో పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తరువాత వస్తున్న మార్పే  ముఖ్యమంత్రి కేసీఆర్ లో కలవరానికి కారణం అంటున్నారు.  ఏదిఏమైనా ఎన్నికల సంవత్సరంలో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వంద సీట్లకు పైగా గెలుస్తామనే ఒకప్పటి ధీమా ఇప్పుదు పార్టీ క్యాడర్ లో కానీ, నాయకత్వంలో కానీ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ముఖ్యంగా వామపక్షాలు చెయ్యేస్తేనే గానీ, మునుగోడు గెలవలేని పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఎన్నికల భయం కనిపిస్తోంది. అలాగే, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న  వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించారు. అందుకే, పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. ఒక విధంగా ఇది ఆయనలోని భయాన్ని బయట పెట్టే  వేడుకోలు లేఖగా ఉందని, బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది . 

అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్  పై ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ ప్రజానీకం చేస్తున్న ప్రధాన ఆరోపణ కుటుంబ పాలన. కుటుంబ అవినీతి.  నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు వినిపించక ముందు నుంచే,  కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొదలు అనేక ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఒక విధంగా చూస్తే లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రాక ముందు నుంచే, సామాన్య  ప్రజానీకంలో సైతం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందనే ‘పర్సెప్షన్’ బలపడుతూ వచ్చింది. 
అందుకు తగ్గట్టుగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి కాక ఇద్దరు మంత్రులు ( కేటీఆర్, హరీష్ రావు), ఒక రాజ్యసభ ఎంపీ (సంతోష్)  ఒక ఎమ్మెల్సీ ( కవిత) కాక, బంధు వర్గానికి చెందిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి వారు నామినేటెడ్ పదవులలో కొలువు తీరడంతో ప్రజలలో సహజంగానే, ఇందు కోసమేనా .. ఒక కుటుంబం కోసమేనా  తెలంగాణ తెచ్చుకుంది అనే భావన బలపడుతూ వచ్చిందని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమికను పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ వంటి ఉద్యమనేతలు గళమెత్తుతూ వచ్చారు. ప్రజలను జాగృత పరిచి మరో తెలంగాణ ఉద్యమం దిశగా అడుగులు  వేస్తున్నారు.

సరిగ్గా ఈ సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం స్కాం, టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజి వ్యవహరం బయటకు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా  కఠిన సవాళ్లను ఎదుర్కుంటున్నారనడంలో సందేహం లేదు. నిజానికి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరకు ఏమవుతుంది అనేది పక్కన పెడితే, కుటుంబ పాలన, కుటుంబ అవినీతిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మాత్రం నిస్సందేహంగా బలం చేకూరింది.  నిజానికి గతంలోనూ కాసినో అవినీతి కేసులోనూ కవిత పేరు విన్పించిన నేపధ్యంలో ఇప్పడు ఢిల్లీ  మద్యం కుంభకోణంలో కీలక భూమిక ఆరోపణకు బలం చేకురిందనే చెప్పాలి.

 అదే సమయంలో వెలుగులోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ  వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా, ప్రతిష్టను మసకబార్చేదిగా  మారింది.  ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ లీకేజీ వ్యవహారం ఉంది. దీంతో అసలే ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు మరింతగా ప్రభుత్వంపై  ఫైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారిలో విశ్వాసం నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. నిజానికి, టీఎస్పీఎస్సీ  లీకేజి వ్యవవహారం, కొంత అలజడి తరువాత సద్దుమణుగుతుందనుకున్నారు.  కానీ, ప్రభుత్వ పక్షం నుంచి, కమిషన్ పక్షం నుంచి కూడా సమస్యను ఎదుర్కొనడంలో సమర్థత, సమయస్ఫూర్తి వ్యక్తం కాలేదు. పైగా, ప్రభుత్వం కలవరపడుతున్నదని  ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని ప్రస్ఫుటంగా తెలిసిపోతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అన్నిటినీ మించి, తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మీద ఉన్న విశ్వాసం బీఆర్ఎస్ మీద లేదన్న విషయం తేటతెల్లమైందనీ,  ఇప్పడు కేసీఆర్ ముందున్నప్రధాన సమస్య ఇదేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.