వసూల్ రాణి రజనీ.. మాజీ మంత్రి ప్రత్తిపాటి ధ్వజం
posted on Jul 13, 2023 @ 10:51AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అభివృద్ధి అనవాలు లేకుండా తుడిచేయడానికే కంకణం కట్టుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రులు పలువురు సొంత పనులలో పడి అభివృద్ధిని విస్మరిస్తున్నారని పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇక విపక్షాలు కూడా పలువురు మంత్రుల అవినీతి, అక్రమార్జనలపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మాజీ మంత్రి అనిల్ అక్రమార్జన, అస్తులపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలపై ఇంకా చర్చ జరుగుతుండగానే మంత్రి రజనీపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ కు సంక్షేమం పేరిట బటన్ లు నొక్కేందుకే ఎక్కడ లేని సొమ్మూ సరిపోవడం లేదనీ, ఆదాయం లేని రాష్ట్రంలో అప్పులు తెచ్చి మరీ అరకొర సంక్షేమం కోసం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తుంటే ఆయన కేబినెట్ లోని మంత్రులు మాత్రం తమతమ నియోజకవర్గాల అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెడతారని ప్రత్తిపాటు అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడుపుతుంటే.. ఆయన మంత్రి రజనీ నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఇంటిని చక్కబెట్టుకునే పనిలో పడ్డారని, ఆ క్రమంలో వసూల్ రాణిగా మారారని ప్రత్తిపాటి విమర్శించారు.
మంతి రజనికి అభివృద్ధిపై శ్రద్ధ లేదనీ, ఆమె దృష్టి అంతా వసూళ్లపైనే కేంద్రీకరించారనీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో మంత్రులందరూ యథారాజా తథా ప్రజా అన్నట్లుగా రాష్ట్ర ప్రగతిని విస్మరించి సొంత పనులు చక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి రజనీపై చేసిన విమర్శలు, సవాళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ఓలేరువాగుపై వంతెన, మురుగునీటి శుద్ధి కేంద్రం వంటివి పురోగతి లేకుండా పడి ఉన్నాయన్నారు. మంత్రి రజనికి నియోజవర్గ అభివృద్ధి పట్టదనీ, ఎంత సేపూ వసూళ్లపైనే శ్రద్ధ చూపుతూ వసూల్ రాణిగా మారారని విమర్శించారు. ఓలేరు వాగు వంతెన వద్ద, మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద సెల్ఫీ దిగిన ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ మంత్రి రజిని అసమర్థత, చేతకానితనం, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం, ఓట్లేసిన ప్రజలకు కనబడకుండా పోవడం, ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం లేకపోవడంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.16 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభించామని... వైకాపా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్ల మూడు నెలల కాంలో ఈ పనులు ఒక్క అంగుళం కూడా కదల్లేదని ప్రత్తిపాటి చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రం మంజూరు చేయగా, ఈ కేంద్రానికి 2018లో శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. దానిని పూర్తి చేసి ఉంటే ప్రజలు అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడకుండా ఎంతో ఉపయోగపడేదని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. అదే విధంగా ఓలేరు వాగు వంతెనకు నాడు రూ.7.68 కోట్లు మంజూరు చేశారని, కానీ జగన్ హయాంలో ఇప్పటి దాకా ఈ వంతెన నిర్మాణం ముందుకు సాగలేదన్నారు. రూ.7.68 కోట్ల పనులను పూర్తి చేయలేని అసమర్థ మంత్రి రజిని నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
రజనికి మంత్రి పదవి మంత్రి కుటుంబం బాగుపడటాకే ఉపయోగపడిందని ప్రత్తిపాటి అన్నారు. ఆమె మంత్రి పదవి వల్ల నియోజకవర్గానికి జరిగిన మేలు ఏదీ లేదని ప్రత్తిపాటి విమర్శించారు. ఎక్కడ ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వాటిపై ఉన్న దృష్టి ఓట్లేసిన ప్రజల ప్రయోజనాలపై లేదన్నారు. వైకాపా ప్రభుత్వానికి, మంత్రి రజినికి ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయమని ప్రత్తిపాటి తెలిపారు.