జగనన్నకు చెల్లి రోజా తెచ్చిన తంటా!
posted on Aug 2, 2022 @ 9:13PM
ఇల్లు మారితే ఫరవాలేదు. పార్టీలూ మారవచ్చు, అసలు ఈ రోజుల్లో జంపింగ్ జిలానీలే ఎక్కువ. కానీ ఇక్కడున్నపుడు తిట్టిన తిట్లు వేసిన వ్యంగ్యాస్త్రాలు అస్సలు మర్చిపోకూడదు. అవతల పార్టీలోకి వెళ్లగానే మంచి పిల్లలా వ్యవహరిస్తే ఎలా? ఇప్పుడు వైసీపీ మంత్రి ఆర్.కె. రోజా గతంలో అన్న మాటల్నే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గుర్తు చేసి మరీ వైసీపీ పరువు తీశారు.
ఏపీలో మద్యనిషేధం వ్యవహారంపై రోజూ ఎవరో ఒకరు ఘాటు విమర్శలతో జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామనే ఉందిగాని ఒక్కసారిగా సంపూర్ణ మద్య నిషేధం అని పార్టీ మానిఫెస్టోలో లేదని ఏపీ మంత్రి అమర్నాధ్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇపుడు విపక్షంతో పాటు ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఇక చిత్రంగా టీడీపీ నేత అనిత మాత్రం వారి మాటలు వారికే అప్పగించాలనుకున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు మద్యం, బార్ పాలసీపై రోజా చేసిన వ్యాఖ్యల్నే ఆమె ప్రస్తావించారు. అపుడు రోజా చె్ప్పినదే ఇప్పుడు అక్షర సత్యమైందన్నారు. అందుకు సాక్ష్యంగా ఏకంగా వీడియోను ట్వీట్ చేసి మరీ ప్రస్తావించడం గమనార్హం. ఇవాళ ఏపీలో తినడానికి తిండిలేదు, తాగడానికి నీళ్లులేవు చేయడానికి పనిలేదు గానీ తాగడానికి తాగినంత మందు మాత్రం ఉంది. మహిళల తాళిబొట్టు తెగినా ఫర్వాలేదుగానీ కమిషన్లుతో ఖజానా నిండాలని బార్ పాలసీ అమలు చేయడం దురదృష్టకరం అంటూ ఆర్.కె. రోజా అప్పట్లో చేసిన కామెంట్‌ను అనిత గుర్తు చేశారు.
మరో ట్వీట్‌లో మన ప్రభుత్వంలో బెల్ట్ షాప్ ల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మద్యం మీద ఆదాయం దాదాపు మూడు రెట్లు కావడంతో పాటు వైసీపీ నేతలే అడుగడుగునా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నా అడిగే దిక్కు లేదు, చర్యలు శూన్యం. ప్రభుత్వ పెద్దలే టార్గెట్లు విధించి మరీ అమ్మిస్తున్నారన్నారు.
కాగా ఇందుకు టీడీపీ కూడా మంత్రి వ్యాఖ్యలకు సమాధానం చెబుతూ ఏపీలో జగన్‌రెడ్డి మధ్యనిషేధం అమలు అటకెక్కించారని, పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే రోజాగారు మరి ఈ విషయంలో మౌనం వహించడమేమిటని నిలదీశారు. చిత్రమేమంటే గతంలో ఆమె టీడీపీలో ఉన్నపుడు ఇదే మద్య నిషేధం మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు జగనన్న ఏదీ చేసినా భజనచేయడం పనిగా పెట్టుకోవడమే ఆమె చేస్తున్నారని తెలుగు దేశం పార్టీవర్గాలు ఎద్దేవా చేస్తున్నారు.
అసలే అవమానాల పాలవుతున్న వైసీపీ సర్కార్‌కి ఇపుడు ఈ ట్వీట్ల గోల మరింత తలభారం కావచ్చు. రోజా చెల్లి వారి అన్న గారికి ఇపుడు మొహం ఎలా చూపుతారు, ఎలా పలకరించి మాట్లాడతారో తెలీదుగాని, పార్టీలో ఆమె పరిస్థితి ఏమిటన్నది విశ్లేషకుల వెయ్యి డాలర్ల ప్రశ్న. ఈ పరిస్థితుల్లో పార్టీవర్గాలు ప్రజల్లోకి వెళ్లి మరింత అవమానపడాల్సివస్తుంది.