మునుగోడు ప్రజల కోసమే.. కాంగ్రెస్‌కు రాజగోపాల్ కటీఫ్
posted on Aug 2, 2022 @ 9:19PM
అందరూ ఊహించినట్టుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే తానీ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రాజీనామా చేశారు గానీ తాను ఏ పార్టీలో చేరేదీ స్పష్టం చేయలేదు. అయినా ఆయన చేరబోయేది కమలం గూటికేనని అందరికీ చాలా కాలం నుంచీ తెలిసిన విషయమే. రాజీనామా చేస్తూ కూడా ఆయన రాష్ట్రంలో అరాచకపాలన పోవాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుందంటూ తన ఉద్దేశమేమిటో విస్పష్టంగా చెప్పేశారు.
రాజీనామా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ఉన్న పోడు భూముల సమస్యను ఇంతవరకూ పరిష్కరించకపోవడమే కేసీఆర్ ప్రభుత్వ తీరుతెన్నులను తెలియజేస్తుందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారనీ, అసలు మాట నిలబెట్టుకోవడమే కేసీఆర్ కు తెలియదని విమర్శించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతలను ఇసుమంతైనా గౌరవించడం లేదనీ, ప్రతిపక్ష నేతలు ఆయన్ను కలవడానికి అవకా శమే ఇవ్వరని రాజగోపాలరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అప్పులగా మార్చారని ఘాటుగా విమర్శించారు.
పోరు రాజకీయ పార్టీల మధ్య కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి, మునుగోడు ప్రాంత ప్రజలకు మధ్య అని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, గత మూడున్నరేళ్లుగా రోడ్లు, ఇళ్ల స్థలాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రాజెక్టుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తున్నాను.
దానికి స్పందన లేదు. అభివృద్ధి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే పరిమితమైంది. ఉపఎన్నికల చర్చ ప్రారంభం కాగానే గట్టుపల్ మండలం తక్షణం మంజూరైంది’’ అని ఉత్తమ్ దృష్టికి తెచ్చారు. మరోవైపు టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సీహెచ్ వంశీచంద్‌రెడ్డి శనివారం రాజగోపాల్‌ను ఆయన నివాసంలో కలిసి ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని చివరి ప్రయత్నంగా కోరారు. అయితే రాజగోపాలరెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన పోరాటం టీఆర్ఎస్ కుటుంబపాలనపైనే అని స్పష్టం చేశారు.