తెలుగుదేశంతో చెలిమికి కమలం తహతహ- తెలంగాణలో పాగా కోసమేనా?
posted on Aug 2, 2022 @ 5:15PM
‘శత్రువుకు శత్రువు మిత్రుడు’.. తాజాగా ఇదే సూత్రాన్ని ఇప్పుడు బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం అమల్లో పెట్టాలని చూస్తోంది. బీజేపీని నడిపిస్తున్న డబుల్ ఇంజిన్ షా-మోడీ ఈ మేరకు ఎత్తులు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, తద్వారా ఎలాగైనా తెలంగాణలో పాగా వేసేందుకు డబుల్ ఇంజిన్ ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం.
తెలంగాణలో బీజేపీకి కేడర్ కొరత, తెలుగుదేశం పార్టీకి నాయకులు కొరత. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం క్యాడర్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్న సంగతి చంద్రబాబు భద్రాచలం పర్యటనతో వెల్లడైంది.
ఈ క్రమంలోనే గతంలో దూరం పెట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని దగ్గర చేర్చుకుని టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోందని జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఎంతగా పోరాడి గెలిచినా టీఆర్ఎస్ కు ఉన్న బలం అంతంత మాత్రమే అని, ఆ విషయం 2014 ఎన్నికల్లో ప్రస్ఫుటం అయిందనే పాయింట్ ను ఇప్పుడు బీజేపీ ఒడిసి పట్టుకుంటోందంటున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 63 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. టీడీపీ- బీజేపీ నుంచి 19 మంది ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అనంతరం ప్రత్యర్థి పార్టీల్లోని సభ్యులను ‘ఆకర్ష్’ మంత్రంతో కేసీఆర్ లాగేసుకున్న వైనం తెలిసిందే. అలా 2014 వరకు టీఆర్ఎస్ కు వాస్తవ బలం లేదనే చెప్పాలి. నిజానికి 2016లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ సొంత బలం లేక జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగానే ఉంది. టీడీపీ గెలుచుకున్న 15 మంది ఎమ్మెల్యేల్లో 13 మందిని తన పార్టీ వైపు తిప్పుకున్నారు కేసీఆర్. దీనికి బంగారు తెలంగాణ అనే సెంటిమెంట్ ను అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ప్రయోగించారు. ఇలా టీడీపీలోని బలమైన నాయకులపై ఆపరేషన్ ఆకర్ష్ కారణంగానే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ 83 స్థానాల్లో విజయం సాధించింది. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ కూడా టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
అలాంటి బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. చీటికి మాటికి కేంద్రంపైన, బీజేపీ సర్కార్ పైన విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒక పక్కన టీడీపీలోని సీనియర్లను లాగేసుకుని తెలంగాణలో ఆ పార్టీని ఒకరకంగా నిర్వీర్యం చేశారనే చెప్పాలి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కేసీఆర్ రాజకీయ శత్రువనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అటు బీజేపీ, ఇటు టీడీపీ ఉమ్మడి శత్రువుగానే భావిస్తాయనడంలో సందేహం లేదు.
తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే మంచి పట్టుండేది. బలమైన కేడర్ కూడా టీడీపీకి వెన్నంటి ఉండేది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల్ని తన పార్టీలోకి లాక్కుని టీడీపీ కేడర్ ను అయోమయంలోకి నెట్టేశారంటారు. టీడీపీ గనుక తెలంగాణలో మళ్లీ అడుగుపెడితే కేడర్, ఆ పార్టీ నేతలు కూడా తిరిగి వచ్చేస్తారనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ కూడా ఇప్పుడు ఇదే అంశాన్ని నమ్ముకుంది. చంద్రబాబు నాయుడిని తెలంగాణలో పునఃప్రవేశం చేయించి, వచ్చే ఎన్నికలకు వెళ్తే.. తాను అనుకున్న విజయాన్ని చేజిక్కించుకోవచ్చని మోడీ, షా ద్వయం భావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మొన్న పోలవరం ముంపు మండలాల్లో బాధితుల పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకు లభించిన అఖండ స్వాగతం, జనం నుంచి వచ్చిన ఆదరణ, తర్వాత భద్రాచలంలో ఆయనకు జనం నీరాజనం పట్టడం కూడా షా- మోడీ ద్వయం ఆలోచనా ధోరణిలో మార్పు రావడానికి కారణమంటున్నారు. చంద్రబాబును ముందు నిలబెట్టి, తెలంగాణలో తాము అనుకున్న ఫలితం సాధించొచ్చనే ప్రణాళికను అమల్లో పెట్టేందుకు వారు సమాయత్తం అయ్యారంటున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే ఈ నెల 7న రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి సంబంధించి జరిగే కీలక సమావేశానికి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలి రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ద్రౌపది ముర్ముకు టీడీపీ ఎమ్మెల్యేల ఓటు అవసరం లేకపోయినా షా ఆదేశంతో ముర్ము టీడీపీ మద్దతు కోసం విజయవాడలో సమావేశం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల స్వాతంత్ర్య సమరయోధులు, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రమావిష్కరణ సందర్భంగా చంద్రబాబుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ లో సంప్రదింపులు జరిపిన వైనం గుర్తు చేసుకుంటున్నారు.
చంద్రబాబును ప్రసన్నం చేసుకుని తెలంగాణలోని టీడీపీ ఓటు బ్యాంకును రాబట్టుకోవాలని, తద్వారా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఎత్తు వేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ దూకుడును ఆపాలని, టీఆర్ఎస్ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయం వ్యూహం పన్నిందంటున్నారు.