ప్రధాని హైదరాబాద్ పర్యటన.. తనను అవమానిస్తున్నారన్న ఎంపీ రేవంత్ రెడ్డి
posted on Nov 28, 2020 @ 12:07PM
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని హకీంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకొని… అక్కడ నుండి నేరుగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ "కోవాక్జిన్" పై సమీక్షకు వెళతారు. అయితే ఇది అధికారిక పర్యటన అయినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి రానవసరం లేదని ప్రధాని కార్యాలయం తెలియ చేసిన సంగతి తెల్సిందే.
అయితే తాజాగా ప్రధాని పర్యటించే ప్రాంత స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డి తనకు ఆహ్వానం లేకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనలో స్థానిక ఎంపీ అయిన తనకు అవకాశం ఇవ్వకపోవటం సరైంది కాదన్నారు. స్థానిక ఎంపీకి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సరైంది కాదని అయన లోక్ సభ స్పీకర్ కు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. హాకీంపేట ఎయిర్ పోర్టుతో పాటు భారత్ బయోటెక్ సంస్థ ఉన్న ప్రదేశం అంతా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. వచ్చే లోక్ సభ సమావేశాల్లో తాను ఈ అంశాన్ని లేవనుత్తుతానని రేవంత్ స్పష్టం చేసారు.