సహనం కోల్పోయిన మిస్టర్ కూల్ సీఎం నితీష్.. తేజస్వి యాదవ్ పై ఫైర్
posted on Nov 28, 2020 @ 11:58AM
కొద్ది రోజుల క్రితం జరిగిన బీహార్ ఎన్నికలలో ఎన్డీయే కూటమి బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో యువకుడైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్డీయే కూటమికి చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్.. సీఎం నితీష్ కుమార్ పై ఆరోపణలు చేయడంతో మిస్టర్ కూల్ సీఎం గా పేరున్న నితీష్ కుమార్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాకుండా తేజస్వి యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత ఏకంగా అబద్ధాలు ఆడుతున్నాడని నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం నితీశ్ కుమార్‌పై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పదేపదే నిలదీశారు. దీంతో నితీష్ ఒక్కసారిగా తేజస్వియాదవ్‌పై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహంతో విరుచుకు పడ్డారు .
‘‘ప్రతిపక్ష నాయకుడు నాకు సోదరుడి లాంటి స్నేహితుడి కుమారుడు కావడం వల్లే ఇప్పటి వరకు ఆయన చెప్పినదంతా ఓపికతో విన్నాను. తేజస్వి చెప్పినదంతా శుద్ధ అబద్ధం. నేను ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడను. ఆయన తండ్రిని లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ను చేసిందెవరో తేజస్వికి తెలుసా? కనీసం ఆయనను డిప్యూటీ సీఎంను చేసిందెవరో తెలుసా? నాపై ఆరోపణలు చేస్తున్న ఆయన మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సమాధానం చెప్పలేరు కాబట్టి ఆయన సభ నుంచి బయటకు వెళ్లడమే మంచిది’’ అని తేజస్విపై విరుచుకుపడ్డారు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తేజస్వి యాదవ్ పదే పదే లేవనెత్తడంతో ఊగిపోయిన నితిశ్ కుమార్.. తేజస్వికి ఈ విధంగా బదులిచ్చారు.