రేవంత్ కు బెయిల్ వచ్చెనా?
posted on Jun 17, 2015 @ 2:34PM
నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడైన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాత్రం బెయిల్ విషయంలో ఊరట కలగడంలేదు. ఇప్పటికే ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో రేవంత్ రెడ్డితో పాటు ఈకేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా హైకోర్టు తలుపులు తట్టారు. అసలు నాలుగు రోజులు ఏసీబీ కస్టడీలో విచారణ చేసిన వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేయోచ్చు కానీ సాక్ష్యాలను తారుమారు చేస్తారు.. సాక్ష్యులను బెదిరిస్తారు అని ఏవో మాటలు చెప్పి రేవంత్ కు బెయిల్ రాకుండా చేశారు ఏసీబీ అధికారులు. తన కూతురి నిశ్చితార్ధ కార్యక్రమానికి వెళ్లినా రేవంత్ రెడ్డి నిబంధనలు అన్నీ కచ్చితంగా పాటించి ఏ కారణాలు తన బెయిల్ కు ఆటంకం కలిగించకూడదని ఇంకా సమయం ఉన్నా కానీ రెండు గంటల ముందే తానే స్వచ్ఛందంగా జైలుకు వెళ్లారు. అయినా కానీ అవేమీ ఏసీబీ లెక్కలోకి పరిగణించలేదు.
ఇదే విషయంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ నేను చెప్పాల్సింది ఆ నాలుగు రోజుల విచారణలోనే చెప్పేశా ఇంకా చెప్పడానికి నాదగ్గర ఏం లేదు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇక ఏసీబీ కోర్టు ద్వారా తనకు బెయిల్ రాదని హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయమని ఏసీబీ ని ఆదేశించింది. రేవంత్ బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఇక హైకోర్టు అయినా రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.అయితే రేవంత్ రెడ్డికి ఈ నెల 29 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన సంగతి తెలిసిందే.