50 లక్షలు నావని రుజువైతే రాజీనామా చేస్తా.. మరో 20 మందికి నోటీసులు?
posted on Jun 17, 2015 @ 12:45PM
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో గంట గంటకి ఉత్కంఠ పెరిపోతోంది. తెలంగాణ ప్రభుత్వ వ్యూహాలు ఏంటి.. వాటికి ఏపీ ప్రభుత్వ ప్రత్యూహాలేంటే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల నాయకులు ఒకరిమీద ఒకరు సవాళ్లు విసురుకోవడం.. మాటల యుద్ధాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలకు పాటు ఎంపీ సీఎం రమేశ్ కు కూడా నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కాగా ఈ కేసు గురించి సీఎం రమేష్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో దొరికిన 50 లక్షల రూపాయలు నావని తెలిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కావాలనే తన మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా వీరితో పాటు మరో 20 మందికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడానికి సన్నద్ధమయినట్టు తెలుస్తోంది. ఈలిస్టులో చంద్రబాబుతో పాటు పార్టీలో అతి ముఖ్యులైన వారి పేర్లు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే దశల వారిగా వారికి నోటీసులు జారీ చేయాలని ఏసీబీ చూస్తుండగా ఎప్పుడు ఎవరికి నోటీసులు వెళతాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు తెదేపా నాయకులు. మరోవైపు కేంద్ర హోంశాఖ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో సెక్షన్-8 అమలు, ఓటుకు నోటు కేసు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ చర్చించనుంది.