రాజధాని అంశంపై జగన్ మౌనం.. బొత్స చేతిలో కీలుబొమ్మ అయ్యారా?

 

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది. ఈ మూడు నెలల్లో వైసీపీ సర్కార్ పాలన ఎలా ఉంది? ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందా?లేదా? అని చర్చ జరగాల్సింది పోయి.. రాజధానిగా అమరావతే ఉంటుందా? లేదా? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

2019 ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. 

ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చేలా బొత్స వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. దీంతో రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు విపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదని, రాజధానిని మార్చేది లేదని సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలనీ.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ జగన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

సీఎం జగన్.. ప్రజావేదిక, పోలవరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వంటి అంశాలపై ముక్కు సూటిగా వ్యవహరించినప్పుడు.. రాజధాని విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజధాని విషయంలో మంత్రి బొత్స వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. కాసేపు వరదలు వస్తే అమరావతిలో కష్టం అంటారు, మరోసారి అమరావతిలో నిర్మాణాలకు డబుల్ ఖర్చు అవుతుందంటారు, ఇంకోసారి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. తాజాగా.. ఒక్క కులం కోసమే రాజధాని నిర్మాణం ఉండకూడదన్నారు. మరో సందర్భంలో.. రాజధానిని తరలిస్తున్నామని ఎవరో అంటే మేం సమాధానం చెప్పాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారే తప్పితే.. అమరావతినే రాజధానిగా ఉంచుతారా లేదా అన్నది కుండబద్ధలు కొట్టినట్లు చెప్పట్లేదు.

బొత్స వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇలాంటి కీలకమైన అంశంపై సీఎం జగన్ ఇంతవరకూ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మాట్లాడాల్సిన అంశంపై మాటిమాటికీ బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బొత్స చేతిలో జగన్ కీలుబొమ్మ అయ్యారా? బొత్స చెప్పినట్లు జగన్ నడుచుకుంటున్నారా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఏ అంశంపైనైనా స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్లాలి. ముఖ్యమైన రాజధాని విషయంలో.. స్పష్టమైన ప్రకటన చెయ్యాల్సిన సమయంలో.. డొంకతిరుగుడు మాటలెందుకని విపక్షాలు నిలదీస్తున్నాయి.

ఇప్పటికే రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త కంపెనీలు రావడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇలాగైతే.. కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఖజానాకు ఆదాయం రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా సాగాలి. అది పూర్తైతేనే కంపెనీలు ఏపీవైపు చూస్తాయి. లేదంటే మిగతా రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. ఇది ఏపీకి తీరని నష్టం. కానీ ఇవేం పట్టనట్టు రాజధాని విషయంలో ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు?. అసలు జగన్ మనసులో ఏముంది?. జగన్ మౌనాన్ని వీడాలి. రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన చెయ్యాలి. అంతే తప్ప.. మంత్రులతో నాన్చుడు ప్రకటనలు చేయించడం వల్ల ఇటు రాష్ట్రానికి, అటు వారి పార్టీకి కూడా నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.