అప్పుడు కేంద్రం... ఇప్పుడు ట్రిబ్యునల్... జగన్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ..!

 

జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొండిగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునసమీక్షిస్తూ రద్దు చేస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ అప్పిటల్ ట్రిబ్యునల్ షాకిచ్చింది. సౌర-పవన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయొద్దని ఏపీ గవర్నమెంట్ ను ఆదేశించింది. అలాగే పీపీఏలపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేదని రెగ్యులేటరీ కమిషన్‌కు తేల్చిచెప్పింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలను యథాతథంగా కొనసాగించాలని జగన్ సర్కారును ఆదేశించింది. పీపీఏల రద్దుపై మూడు కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది.

పీపీపీలను పునసమీక్షిస్తూ పలు సోలార్, విండ్ విద్యుత్ కంపెనీలకు జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో... అనంతపురం, కడపకి చెందిన మూడు కంపెనీలు... ఎస్‌బీఈ, అయన, స్పింగ్ కంపెనీలు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్ లో తాము అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నాయి. అంతేకాదు పీపీఏలను సమీక్షించడమంటే... తమపై నమ్మకం లేకపోవడమేనని... ఇది తమ కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ ట్రిబ్యునల్ ముందు కంపెనీలు వాదనలు వినిపించాయి. దాదాపు రెండు నెలలుగా సాగిన ఇరుపక్షాల వాదనలను విన్న విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్.... పీపీఏలను రద్దు చేయొద్దంటూ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పీపీఏల సమీక్ష, రద్దు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించింది.

ఏదేమైనా పీపీఏల సమీక్ష, రద్దు నిర్ణయాలపై జగన్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జపాన్ లేఖతో ఇప్పటికే  కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా, ఇఫ్పుడు ఏకంగా విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునలే షాకిచ్చింది. మరి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలపై జగన్ సర్కారు ఏవిధంగా స్పందిస్తుందో... ఎలా ముందుకెళ్తుందో చూడాలి.