లోకేష్ అంటే పప్పు కాదు.. నిప్పురా!
posted on Jun 14, 2024 @ 11:33AM
అందలాన్ని ఎక్కించేది వారసత్వం కాదు... అర్హత అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ వుంటారు. ఆ మాటకి మరోసారి తార్కాణంగా నిలిచారు నారా లోకేష్. వారసత్వంతో మాత్రమే కాకుండా.. అర్హతతో అందలాన్ని సాధించుకున్న యువతరం నాయకుడు నారా లోకేష్. వైసీపీ పిశాచాలు లోకేష్‌ని టార్గెట్ చేసి పప్పు... పప్పు అని విషప్రచారం చేసినా, తన కృషితో, పట్టుదలతో తాను పప్పు కాదని... వైసీపీ నాయకుల తుప్పు వదిలించే నిప్పు అని తనను తాను నిరూపించుకున్నారు.
యువగళం పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్కచేయకుండా ముందుకే సాగారు. ఫలితంగా పార్టీని, వ్యక్తిగత తన గ్రాఫ్‌ను కూడా పెంచుకున్నారు. అత్యంత కీలకమైన సమయంలో అధికార పార్టీని గద్దె దించడానికి తనవంతు భాగస్వామ్యాన్ని అందించారు. లోకేష్‌లోని కసికి తోడైన అవిరళ కృషి.. ఆయనను పరిణితి చెందిన పెద్ద నాయకుల కోవలోకి చేర్చాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో మంగళగరిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో లోకేష్‌లోని పరిణతి మరింత స్పష్టంగా కనిపించింది. 2019 ఎన్నికలలో తాను ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని ఈసారి యాభై వేల ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి పట్టులేని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తేనే తాను నాయకుడు అనిపించుకుంటానని చెప్పారు. ఆ ఒక్కమాటతోనే ఆయన వారసుడు కాదు.. నాయకుడు అనే విషయం ప్రూవ్ అయింది. 2024 ఎన్నికల సందర్భంగా ఆయన కృషిని మెచ్చిన ప్రజలు ఆయనకు 91 వేల మెజారిటీ ఇచ్చారు. అంటే, ప్రజలు ఆయన్ని నమ్మారు.. ఆయన పనితీరును నమ్మారు.. అందుకే పట్టం కట్టారు. ఈ విజయంతో ఇప్పటి వరకు వైసీపీ గ్రామసింహాలు మొరిగిన మొరుగుళ్ళన్నీ గాలిలో కలిసిపోయాయి.
నారా లోకేష్ మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసినప్పుడు రాజధాని ప్రాంతమని, కమ్మ కులస్తులు ఎక్కువగా వుండే ప్రాంతమని వైసీపీవాళ్ళు ప్రచారం చేశారు. నిజానికి మంగళగిరిలో ఐదు శాతం కూడా కమ్మ కులస్తులు ఉండరు. అలా కులాలను రెచ్చగొట్టి లోకేష్‌పై కుల ప్రయోగం చేశారు. ఫలితంగా ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం వద్దని, సేఫ్‌గా వుండే స్థానాన్ని ఎంచుకోవాలని శ్రేయోభిలాషులు సూచించారు. కానీ, లోకేష్ పడిన చోటనే నిలదొక్కుకోవాలని మంగళగిరినే ఎంచుకున్నారు. ఆయన నమ్మకం నిజమైంది.. అటు పార్టీతోపాటు ఇటు లోకేష్ కూడా ఘన విజయం సాధించారు. విమర్శకుల నోళ్ళు మూతపడేలా చేశారు.