కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం?
posted on Jun 13, 2024 @ 2:50PM
జగన్ జీవితంలో తర్వాత జరిగే ఘట్టం ఏమిటో అందరికీ తెలిసిందే. చక్కగా మూటాముల్లె సర్దుకుని జైలుకు వెళ్ళిపోవడమే. మరి ఆయన జైల్లోకి వెళ్తే, జాతీయ స్థాయిలో ఆయన కోసం పోరాడే పార్టీ గానీ, నాయకుడుగానీ ఎవరైనా వున్నారా? జగన్ పాతాళంలో కూరుకుపోతే ‘చెయ్యి’చ్చి పైకి తెచ్చే పార్టీ గానీ, నాయకుడు గానీ ఎవరైనా వున్నారా? ఎవరూ లేరు. అందుకే జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి షర్మిల అధ్యక్షురాలిగా వున్నారు. మొన్నటి ఎన్నికలలో షర్మిల నాయకత్వం దారుణంగా విఫలం అయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నాయకత్వం మీద నమ్మకం కోల్పోయింది. ఆమెని సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలని చూస్తోంది. ఈ అవకాశాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి, తాను కాంగ్రెస్ నాయకుడిగా మారడం వల్ల ఇటు చెల్లెలి మీద ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు అటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అండ దొరుకుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. భవిష్యత్తులో జగన్ అరెస్ట్ అయితే, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసి తనను కాపాడుతుందని జగన్ ఆశిస్తున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటే జగన్‌కి పడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగానే సోనియాగాంధీ తనను ముఖ్యమంత్రిని చేస్తారని జగన్ ఎక్కువగా ఆశించారు. తండ్రి శవం అక్కడే వుండగానే ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కూడా చేశారు. నీకు అంత సీన్ లేదమ్మా అని సోనియాగాంధీ జగన్‌ని పక్కకెళ్ళి ఆడుకోమని చెప్పి రోశయ్యని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చబెట్టారు. జగన్ కేసులన్నీ తిరగదోడి జైలులో పడేలా చేశారు. ఆ కేసులు ఇప్పటికీ జగన్‌ని వెంటాడి వేధిస్తూనే వున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడన్నట్టు... ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీయే తనకు శత్రువు. కేంద్రంలో ఎన్డీయేకి కాంగ్రెస్ శత్రువు.. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని తన మిత్ర పార్టీగా ప్రస్తుతం జగన్ భావిస్తున్నారు. ఈ ఐదేళ్ళపాటు ఒంటికాయ శొంఠికొమ్ములాగా ఒక్కడే తంటాలు పడేకంటే, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ అండ సంపాదించడం మంచిదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఆలోచనలో జగన్ వున్నట్టు తెలుస్తోంది.