సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!
posted on Feb 4, 2021 @ 11:12AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లాలోనే ఆయన ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కార్యక్రమానికి చుక్కెదురైంది. సీఎం జగన్ సొంత ఇలాకాలోనే ఇంటింటికి రేషన్ పంపిణికి బ్రేక్ పడింది. రేషన్ పంపిణి కోసం కేటాయించిన వాహనాల డ్రైవర్లు డ్యూటీ చేయకుండా రోడ్డెక్కారు. దీంతో కడప నగరంలో ఇంటి ఇంటికీ నిత్యావసర సరుకుల పంపిణీ చేసే వాహనాలు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 వాహనాలను నిలిపివేసిడ్రైవర్లు ఆందోళనకు దిగారు. డ్రైవర్ పని కాకుండా తమతో అన్ని పనులు తమతోనే చేయిస్తున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సర్కార్ ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పంపిణీ తొలి రోజు నుంచే ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వాహనాలకు సమకూర్చిన తూనికల మిషన్లు సరిగా పని చేయడం లేదు. పని చేసినా పది మంది కార్డుదారులతోనే దాని చార్జింగ్ అయిపోతోంది. దీంతో రోజుకు 10 మందికి మించి రేషన్ అందించలేకపోతున్నారు. ఇంకా తమకు వద్దంటున్నా కందిపప్పును అంటగడుతున్నారని కొందరు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. సరుకులు ఇవ్వని వారికీ కూడా ఇచ్చినట్లు డీలర్లు నమోదు చేయాలంటున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఇన్ని సమస్యలకు తోడయ్యారు డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లు. ఈ పని తమ వల్ల కాదంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. ఓవైపు డ్రైవింగ్, మరో వైపు రేషన్ మూటలు మోయడం మా వాళ్ళ కాదని తెగేసి చెబుతున్నారు. రేషన్ కొలతలు వేయడం, డబ్బులు వసూలు చేసి తిరిగి డీలర్లకు చెల్లించడం వంటి పనులన్నింటినీ.. ఒక్కరమే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని రూ.10 వేల జీతానికి వచ్చి. ఈ చాకిరీ చేయడం కంటే కూలికి వెళితే రోజుకు 500 చొప్పున నెలకి 15000 వస్తాయని అంటున్నారు రేషన్ పంపిణి వాహనాల డ్రైవర్లు. బియ్యం మూటలు మోసేందుకు హెల్పర్ ని ఇవ్వాలని, పనిచేయని తూనికల మిషన్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.