రాజన్న రాజ్యంలో పోటీ చేసే హక్కు లేదా! వైసీపీ బరి తెగింపులతో జనాల్లో చర్చ
posted on Feb 4, 2021 @ 11:40AM
బెదిరింపులు.. దాడులు... కిడ్నాపులు.. ఇవీ పంచాయతి ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న దారుణాలు. పారదర్శక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా వైసీపీ నేతలు మాత్రం బరి తెగిస్తూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. అయినా వినకపోతే దాడులకు పాల్పడుతున్నారు. కిడ్నాపులు కూడా చేసేస్తున్నారు. వైసీపీ నేతల తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారుతున్నాయి.
విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్ వేశారు. ఆయన కూడా వైసీపీకి చెందిన వ్యక్తే. అయితే ఎమ్మెల్యే కన్నబాబురాజు మరో వ్యక్తితో ఆ వార్డుకు నామినేషన్ వేయించారు. సత్యం రెబల్‌గా మారారు. సత్యం అల్లుడు సంతోష్ వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండురోజుల క్రితం సంతోష్ కు ఎమ్మెల్యే కన్నబాబురాజు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించారు. దీనిపై సంతోష్ బుధవారం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆడియో రికార్డింగ్‌నూ పోలీసులకు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరులో 9వ వార్డుకు టీడీపీ మద్దతుతో కమ్మర సూర్యామణి నామినేషన్ వేశారు. ఆమె భర్త అబ్బులు తమకున్న ఎకరం పొలంలో చేపల చెరువు తవ్వి చేపల పెంపకం నిమిత్తం నక్కబోయిన సన్యాసిరావుకు ఏడాదికి రూ.60 వేలకు లీజుకిచ్చారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ చెరువులో విషం కలిపారు. దీంతో చేపలు భారీగా చనిపోయి సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీంతో సన్యాసిరావు భార్య చంద్రకాంతం బుధవారం గుండెపోటుతో మరణించారు. దీంతో కలత చెందిన సూర్యామణి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో సాతులూరు గ్రామానికి సర్పంచి అభ్యర్థిగా పచ్చల రోజారాణి (వైసీపీ రెబల్) బుధవారం నామినేషన్ వేసేందుకు రాగా వైసీపీ నేత గద్దె కోటయ్య నామినేషన్ కేంద్రంలోకి దూసుకొచ్చి పత్రాలను లాక్కొని చించేశారని అవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికలు శకుని తంత్రంలా జరుగుతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు, ఎన్నికల పేరుతో రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ సీమగా మారుస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
ఏపీ ని రాజన్న రాజ్యం చేస్తాం అని చెప్పిన జగన్ సర్కార్ రావణ రాజ్యంగా మారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. అక్రమ కేసులు, దాడులకు పాల్పడుతున్నారని ఆందోళనకు గురవుతున్నారు రాజన్న రాజ్యం లో సామాన్యుడికి పోటీ చేస్తే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు.