అమ్మఒడి రాలేదని అడిగిన బాలుడిపై దాడి చేసిన హెడ్ మాస్టర్
posted on Feb 4, 2021 @ 10:27AM
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనకు అమ్మఒడి రాలేదని అడిగిన ఒక పేద విద్యార్థిపై ఆ పాఠశాల హెడ్ మాస్టర్ ఏకంగా దాడి చేశాడు. నడిరోడ్డుపై ఆ పిల్లవాడిని పట్టుకుని ఎడాపెడా కొట్టాడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతునిలో నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పూర్తీ వివరాలిలా ఉన్నాయి. ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివిన రూపేష్ కు అమ్మఒడి పథకం వర్తించలేదు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన రూపేష్ తో పాటు అతని తల్లిదండ్రులు అమ్మఒడి పథకం తమకు కూడా వచ్చేలా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మను పలుమార్లు కలిసి ప్రాధేయపడ్డారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో వారికి ఆ పథకం రాలేదని చెప్పి ఆయన చేతులు దులుపుకున్నారు.
ఇది ఇలా ఉండగా రూపేష్ ఈ ఏడాది సమీపంలో వున్న నర్సింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేరాడు. ఈ పాఠశాలలో అమ్మఒడి పథకం గురించి హెచ్‌ఎంను అడగ్గా...ముందు చదివిన పాఠశాలలోని హెచ్‌ఎం అప్‌లోడ్ చేశారా? లేదా? తెలుసుకుని రావాలని సూచించారు. దీంతో చివరి ప్రయత్నంగా రుప్పేశ్ మళ్ళీ తాను ఇంతకు ముందు చదివిన ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం శర్మను కలిసి.. అమ్మఒడి గురించి అడగడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన హెచ్‌ఎం శర్మ...విచక్షణ మరచిపోయి ఆ విద్యార్థి రుప్పేశ్ చెంప పగలకొట్టాడు. అంతటితో ఆగకుండా తనను అమ్మఒడి పథకం డబ్బులు అడిగేందుకు నీకు ఎంత ధైర్యమంటూ విద్యార్థిని రోడ్డుపైకి తీసుకువచ్చి మరీ కొట్టాడు. ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతనైతే తగిన సాయం చేయాలనీ.. లేకపోతె అమ్మఒడి సాయం ఎలా పొందాలో చెప్పాలి కానీ ఇలా కొట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.