చంద్రబాబును రూలర్ అంటూ పొగిడిన వైసీపీ స్టార్
posted on Dec 16, 2019 @ 2:01PM
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీ లోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. గెలిచిన తర్వాత వాళ్ల పంట పండింది. ఇక జగన్ తోనే తమ ప్రయాణమని జీవితా రాజశేఖర్ కూడా చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నారు. పార్టీలు మారి మారి చివరికి జగన్ దగ్గరకు వచ్చి ఆగారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసిపి కండువాలు కప్పుకున్న జీవితా రాజశేఖర్ జగన్ కు మద్దతుగా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఈ జంట ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ కు హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. నిజంగానే ఇపుడు పార్టీ మారారేమో అనే అనుమానం వచ్చేసింది. దానికి కారణం బాలయ్య రూలర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనే చెబుతున్నారు.
ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యి మళ్లీ కోలుకుని.. బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు రాజశేఖర్. తన వంతుగా వచ్చి బాలయ్య సినిమాకు ప్రమోషన్ చేశాడు. గతంలో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమా ట్రైలర్ లాంచ్ చేశాడు బాలయ్య. ఇప్పుడు ఈయన వేడుకకు వచ్చి లెక్క సరిచేశాడు రాజశేఖర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలయ్య రూలర్ ఆయన తండ్రి కూడా ఓ రూలర్ అని పొగిడాడు రాజశేఖర్. అక్కడితో ఆగకుండా ఆయన వియ్యంకుడు కూడా ఓ రూలర్ అంటూ చంద్రబాబుని కూడా పొగిడేశాడు ఈ సీనియర్ హీరో. ఈ సినిమా సంక్రాంతి వరకూ రూల్ చేస్తూనే ఉంటుందని ఫ్యూచర్ చెప్పాడు రాజశేఖర్. అక్కడ స్టేజి పై రాజశేఖర్ చెప్పిన మాటలు బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చినా వైసిపి వాళ్లకు మాత్రం షాకిచ్చాయి. ఓ పార్టీలో ఉండి మరో పార్టీని పొగడటం ఏంటో ఆ పార్టీ నాయకుడు భజన చేయడమేంటో అంటూ వైసిపి నేతలు సీరియస్ అవుతున్నారు. తోటి హీరో కాబట్టి బాలయ్య సినిమా వేడుకకు వెళ్లడంలో తప్పు లేదని కానీ అక్కడ బాలయ్యతో పాటు అందరికీ భజన చేయాల్సిన అవసరమేంటని రాజశేఖర్ దంపతుల పై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.