ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పై హత్యాయత్నం?.. కల్లెడ సర్పంచ్ భర్త అరెస్ట్
posted on Aug 2, 2022 @ 9:33PM
తెలంగాణా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు కుట్ర జరిగిందన్న వార్తలపై ఆర్మూర్ కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య స్పందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో తమకు గొడవ జరిగిందన్న మాట వాస్తవమేనని, అప్పటి నుంచీ ఆయన మాపై కక్ష పెంచుకున్నారని ఆమె అన్నారు. కల్లెడలో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ18 లక్షల బిల్లులు రాకుండా ఆయన అడ్డుకున్నా రని ఆమె ఆరోపించారు. దీన్ని గురించి ప్రశ్నించడం వల్లనే తనను పదవి నుంచి తప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని గురించి ఎమ్మెల్యే, కలెక్టర్ నూ కలవడానికి అనేక పర్యాయాలు ప్రయత్నించానని అన్నారు. కాగా తన భర్త ప్రసాద్ గౌడ్ ఆయన్ను కలవడానికి వెళ్లారని, అయితే ఆయన వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవని అన్నారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగిందనేది అవాస్తవమని, తన భర్త తుపాకీ, కత్తి వంటివి తీసికెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా బంజారా హిల్స్ రోడ్డు నెం.12లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఎమ్మల్యేపై హత్యకు కుట్ర కోణంలో విచారణ చేసారు. అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బంజారా హిల్స్ పోలీసులు ప్రసాద్ గౌడ్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఆర్నూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమాన స్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు.