లంకతో తొలి టి20.. టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ
posted on Jan 4, 2023 5:37AM
చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. శ్రీలంకతో ముంబై వాంఖడే స్టేడియంలో బుధవారం (జనవరి 3)జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ 2 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది.తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
శ్రీలంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ శనక 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి హసరంగ (10 బంతుల్లో 21) నుంచి సహకారం అందింది. ఓ దశలో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా ఈ జోడీ ఆదుకుంది. అయితే హసరంగను శివమ్ మావి ఔట్ చేయగా, శనకను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు.
చివరి ఓవర్లో లంక విజయానికి 13 పరుగులు అవసరం కాగా, కరుణరత్నే (23 నాటౌట్), కసున్ రజిత (5) పోరాడారు. విజయం సాధించాలంటే ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, అక్షర్ పటేల్ వేసిన బంతిని కరుణరత్నే బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆఖరి ఓవర్లో ఇద్దరు రనౌట్ అయ్యారు.
టీమిండియా బౌలర్లలో డెబ్యూ బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసిందంటే అందుకు చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ రెచ్చిపోవడం వల్లే సాధ్యమైంది.
హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తే భారత భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. అయితే లంక స్పిన్నర్లు భారత్ దూకుడును అడ్డుకున్నారు. దాంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. శుభ్ మాన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజు శాంసన్ 5 నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక, ఆ బాధ్యతను హుడా, అక్షర్ పటేల్ తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆఖర్లో బ్యాట్లు ఝుళిపించి భారత్ స్కోరును 162 పరుగులకు చేర్చారు. ఈ విజయంతో లంకతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.