Read more!

ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోడానికి రెడీ: రాహుల్

 

ఎన్నికల చివరిదశకు చేరుకొంటున్న కొద్దీ రాన్రాను కాంగ్రెస్ పార్టీలో గెలుస్తామనే ఆశ, నమ్మకం సన్నగిల్లిపోతున్నట్లు కనిపిస్తోంది. మోడీ ప్రధాని కాకుండా అడ్డుకొనేందుకు అవసరమయితే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చేందుకు కూడా తాము సిద్దమని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన మొదటి సారిగా తన ఓటమిని అంగీకరిస్తూచేసిన ప్రకటనగా చెప్పుకోవచ్చును. కానీ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ యువరాజవారు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, తాము థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని ఎన్నడూ అనలేదని, అదంతా గాలివార్తలని కొట్టి పడేసారు. తాము ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని, ఒకవేళ గెలవకుంటే ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు కూడా సిద్దపడతాము తప్ప థర్డ్ ఫ్రంట్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఈయబోమని ప్రకటించారు.

 

మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా ఎందుకు మనసు మార్చుకోన్నారనే విషయం పక్కన బెడితే, ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు సిద్దమని ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ పూర్తిగా తన పరాజయం అంగీకరించినట్లయింది. ఈ మాటల ప్రభావం వలన త్వరలో జరుగబోయే మిగిలిన రెండు దశల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్న రాహుల్ గాంధీయే స్వయంగా ఇంకా ఎన్నికలు పూర్తికాక మునుపే తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు సిద్దమని చెపుతున్నపుడు, ప్రజలు కూడా అటువంటి ఓడిపోయే పార్టీకి ఓటు వేసి అమూల్యమయిన తమ ఓటును ఎందుకు వృధా చేసుకోవాలని భావించి, 300 సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ/ఎన్డీయే కూటమికే ఓట్లు వేసే అవకాశం ఉంది. రాజకీయ పరిణతి ఉన్న ఏ రాజకీయ నాయకుడు, పార్టీ కూడా ఇటువంటి కీలకమయిన తరుణంలో ఈవిధంగా మాట్లాడి తమకు పడబోయే ఓట్లను ప్రత్యర్ధుల ఖాతాలోకి మళ్ళించరు. కానీ విశాల హృదయం కల యువరాజవారు చాల ఉదారంగా తమ ప్రత్యర్ధ బీజేపీకి ఆ అవకాశం కల్పిస్తున్నారు.