Read more!

జగన్, కేసీఆర్ లతో జైరామ్ యుద్ధం దేనికి?

 

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజల వద్దకు విభజనలో ప్రముఖ పాత్ర పోషించిన జైరామ్ రమేష్ ను ప్రచారానికి పంపడం ఆత్మహత్యతో సమానమని కాంగ్రెస్ తెలియదనుకోలేము. రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితుడు, మంచి ప్రజాకర్షణ గల చిరంజీవి వంటి వ్యక్తికే రాష్ట్ర ప్రజల నుండి తిరస్కారం ఎదురవుతుంటే, దగ్గరుండి రాష్ట్ర విభజన చేసిన జైరామ్ రమేష్ ని చూస్తే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో, దానివలన కాంగ్రెస్ పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఎవరయినా ఊహించవచ్చును.

 

కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఏరికోరి ఆయననే ఎందుకు పంపింది? కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఎందుకు అంతలా విరుచుకుపడుతున్నారు? బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడం తాను జీర్ణించుకోలేకపోతున్నాని, జగన్ తిరిగి జైలుకు వెళ్ళక తప్పదని ఆయన ఎందుకు పదేపదే చెపుతున్నారు? అని ప్రశ్నించుకొంటే, ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రజలతో ఆడుతున్న ‘మైండ్ గేమ్’ లేదా ‘డబుల్ గేమ్’ అని చెప్పుకోవచ్చు.

 

అదెలాగ అంటే, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో 17యంపీ సీట్లు సాధించుకొనేందుకే, సీమాంద్రాలో పార్టీని, తమ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టిందని కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలే చెప్పారు. సీమాంద్రాలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని కూడా వారే చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే తెలంగాణాలో తెరాస, సీమాంద్రాలో వైకాపా గెలవడం చాలా అవసరం. కాంగ్రెస్ తొలి ప్రాధాన్యత తను తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడమే కానీ ఆంధ్రా, తెలంగాణాలలో అధికారం చెప్పడం కాదు. ఈసారి ఎన్నికలలో గెలిచి కేంద్రంలో ఆహికారం హస్తగతం చేసుకోలేకపోతే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందని అందరికీ తెలుసు. అందుకే, దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తోంది. సీమాంద్రాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సిద్దం చేసిన వ్యూహం గురించి ఇప్పటికే ప్రజలందరికీ బాగా తెలుసు.

 

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేఖత ఉందనే సంగతి ప్రజలకే కాదు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఆ వ్యతిరేఖతను మరింత పెంచుకోగలిగితేనే, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి బదిలీ అవుతాయి. అందుకు నోటి దురద ఉన్న జైరామ్ రమేష్ వంటి వ్యక్తికంటే అర్హుడు, సమర్ధుడు మరొకరు ఉండబోరు.

 

ఆయన తెలంగాణాలో మంచి ప్రజాధారణ ఉన్నకేసీఆర్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతూ పరోక్షంగా తెరాసకు ఏవిధంగా మేలు చేకూర్చేడో అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా సీమాంద్రాలో కూడా ప్రజాధారణ ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా అవాకులు చవాకులు వాగుతూ ప్రజల దృష్టిలో తాను, తన కాంగ్రెస్ పార్టీని విలన్లుగా మార్చి, జగన్మోహన్ రెడ్డిని హీరో చేసే పనిలోపడ్డారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటే, వారు ప్రత్యర్ధులు గనుక అది సహజమేనని ఎవరయినా భావిస్తారు. కానీ ఎన్నికల తరువాత తమ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోయే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను జైరామ్ రమేష్ వంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నేతే స్వయంగా తిట్టడం, విమర్శించడం కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న అతితెలివికి అద్దం పడుతోంది.

 

సాధారణంగా ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎవరయినా విమర్శిస్తే, అటువంటి వారిపట్ల వ్యతిరేఖత కనబరుస్తూ తమకు నచ్చిన వారివైపు మరింత బలంగా ఆకర్షితులవుతారు. గత ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి విషయంలో ఇది రుజువు అయ్యింది కూడా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా అటువంటి వ్యూహమే అమలు చేస్తోంది. అందుకే, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కూడా పక్కనబెట్టి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను ప్రత్యేకంగా పంపింది. ప్రస్తుతం ఆయన తనకు అప్పజెప్పిన పనిలో చాల వరకు సవ్యంగానే పూర్తి చేసారనే చెప్పవచ్చును. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహాన్ని ప్రజలు తమ ఓటు అనే వజ్రాయుధంతో చేధించుకొని బయటపడగలరో లేదో త్వరలోనే తేలుతుంది.