Read more!

సీమాంద్రాలో కూడా బాబు బీసీ మంత్రం పనిచేస్తుందా?

 

ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా, కాంగ్రెస్, తెరాసల విజయవకాశాలకు గండికొట్టే స్థాయికి పార్టీని చేర్చారు. అయితే సీమాంద్రాలో తానే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నందున, ఆ మంత్రాన్ని యధాతధంగా జపించడం సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అవుతుంది గనుక దానిని కొద్దిగా మార్పు చేసి, సీమాంద్రాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించి ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికేనని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది.

 

సీమాంద్రాలో తెదేపా-బీజేపీ తరపున చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ సీమంద్రాలో జగన్ ప్రభావం కూడా చాలా బలంగా ఉంది. జగన్, షర్మిల చేస్తున్న ప్రచారానికి ప్రజలలో విశేష స్పందన కనబడుతోంది. వైకాపా నుండి తెదేపా చాలా గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో, హామీలు గుప్పించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మిగిలిన ఈ మూడు రోజుల్లో ప్రజలను ఎలాగయినా తమవైపు తిప్పుకోవాలని రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈరోజు ఈ సరికొత్త తాయిలం ప్రకటించి ఉండవచ్చును.

 

అయితే ఈ సరి కొత్త తాయిలం ప్రకటించడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చును. బీజేపీతో తెదేపా అంటుకట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తెదేపాకు కూడా మతతత్వ రంగు పులిమెందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. దానివలన తెదేపాకు ముస్లిం మరియు క్రీస్టియన్ ప్రజల ఓట్లు కొంతమేర నష్టపోయే అవకాశం కూడా ఉంది. బహుశః ఆ లోటుని భర్తీ చేసుకోనేందుకే చంద్రబాబు మళ్ళీ బీసీ మంత్రం పటిస్తున్నట్లున్నారు. అయితే అన్నిసమస్యలకు ‘సర్వరోగ నివారిణి’లా ఒకటే మంత్రం పనిచేస్తుందా? లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.