ది వాల్ ద్రావిడ్ చేతే గంతులేయించిన కోహ్లీ సూపర్బ్ ఇన్నింగ్స్
posted on Oct 25, 2022 6:51AM
విరాట్ కోహ్లీ..పరుగుల యంత్రం, ఛేజింగ్ ఛాంపియన్.. తన కళాత్మక బ్యాటింగ్ తో భారత్ కు పాక్ పై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అసలే మాత్రం అవకాశం లేని చోట, ఓటమి తథ్యమని అంతా చేతులెత్తేసిన వేళ.. తనకే సాధ్యమైన అత్యద్భుత ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు.
భారత్- పాక్ మధ్య మ్యాచ్ అంటే.. అది కేవలం క్రీడ కాదు.. అంతకు మించి.. క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో చూస్తారు. అటువంటి మ్యాచ్ చివరి వరకూ అంటే చివరి బంతి వరకూ పోటా పోటీగా సాగిందంటే.. స్టేడియంలో ఉన్న 90 వేల పైచిలుకు ప్రేక్షకులే కాదు.. టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ ను కన్నార్పకుండా చూసే ప్రేక్షకులు కూడా మునికాళ్ల మీద నుంచి గోళ్లు కొరుక్కుంటూ ఊపిరి బిగపెట్టి చూస్తారనడంలో సందేహం లేదు.
దీపావళి ముందు రోజు మెల్ బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోట్లాది మంది నరాలు తెగిపోయే ఉత్కంఠతో చూశారు అందులో సందేహం లేదు. అలా చూసి భారత్ గెలుపు అనంతరం ఆనందంతో గెంతులు వేసిన వారిలో క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ కూడా ఉన్నాడు. ఇక మిస్టర్ కూల్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే టీమ్ ఇండియా హెడ్ కోచ్ కూడా ఆనందంతో చేతులు విసరడం, ఆనందంతో ఉప్పొంగిపోవడం చూశాం. ఎప్పుడూ కూల్ గా కనిపించే మిస్టర్ వాల్ ద్రావిడ్ శనివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా విజయం తర్వాత భావోద్వేగాలు నియంత్రించుకో లేకపోయాడు. ద్రావిడ్ ఆనందంతో గంతులు వేశాడు..
విరాట్ కు ఎదురెళ్లి ఆలింగనం చేసు కున్నాడు. ఇందుకు సంబంధించి ఐసీసీ పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఎంతటి ఉత్కంఠ భరితమైన సమయంలోనైనా సరే రాహుల్ ద్రావిడ్ పెద్దగా భావోద్వేగానికి గురికాడు. కామ్ గా ఉంటాడు.
కోల్ కతా వేదికగా 2001లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ లో ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యం సాధించి మ్యాచ్ ను గెలిపించిన సందర్భంలో కూడా ఎలాంటి ఎమోషన్స్ ప్రదర్శించలేదు. గంభీరంగానే ఆ క్షణాలను ఆస్వాదించాడు ద్రావిడ్.
వాల్ అన్న తన బిరుదుగు తగ్గట్టుగా గోడలాగే ఎలాంటి ఎమోషన్స్ నూ సాధారణంగా ప్రదర్శించడు. అయితే అటువంటి వాల్ ద్రావిడ్ కూడా దీపావళిని ఒక రోజు ముందే తీసుకువచ్చిన కోహ్లీ సూపర్బ్ ఇన్నింగ్స్ ను చూసి బ్రేక్ అయ్యాడు. ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక పోయాడు. జట్టు సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. గంతులు వేశాడు. ఆ తరువాత డ్రెస్సింగ్ రూమ్ కు వస్తున్న విరాట్ కోహ్లీకి ఎదురెళ్లి హత్తుకుని అభినందించాడు