విభజన చట్టంలో ఉన్నా తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే!
posted on Oct 24, 2022 @ 12:48AM
కొన్నివార్తలు అంతే, చస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. పునరపి జననం.. పునరపి మరణం...అన్నట్లు అన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుకు సబందించిన వార్త కూడా అంతే. నిజానికి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన చాలా చాలా చెల్లని హామీలలో ఇది కూడా ఒకటి. ఎపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ’ వంటి అనేక ఉత్తుత్తి హమీల్లాగానే, ఉభయ తెలుగు తెలుగు రాష్టాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల నెంబర్ పెంచే హామీ కూడా ఉత్తుత్తి హమీనే అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా, నియోజక వర్గాల పెంపు అనే మాట వినగానే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సందడి మొదలవుతుంది. నిజానికి ఇందుకు సంబంధించి గడచిన ఎనిమిదేళ్ళలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్’లో అనేక సందర్భాలలో ప్రస్తావన ఇచ్చారు.అయితే ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం, అది ఇప్పట్లో కాదని ఖరాఖండిగా చెపుతూనే వుంది. 2026 జనాభా లెక్కలు తేలిన తర్వాత చూద్దాం అన్నట్లుగా దాటవేస్తోంది.
అయితే ఇప్పడు కొత్తగా మరో ఆశ చిగురించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రావు రంజిత్ వివరించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే, సుప్రీం ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీకి నోటీసులు జారీ చేసింది.
ఇంతవరకు రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇదే ప్రశ్న వేసినా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టిచుకోలేదు. మంత్రులు నియోక వారలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సమదాన్నాని డేటా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు, సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఏదో ఒక వైఖరి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని న్యాయనిపుణులు స్పష్టం చేశారు.
నిజానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రాన్ని టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం అదే ఆవు కథను వినిపిస్తూ వచ్చింది.
అయితే తెరాస నియోజక వర్గాలు పెంచాలని కోరినా, బీజేపీ ప్రభుత్వం కాదన్నా అందుకు ప్రధానంగా రాజకీయమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రాజకీయంగా లాభనష్టాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, నియోజక వర్గాలు పెంచితే తమకు అనుకూలమని అంచనాకు వస్తేనే ఈ అంశంపై ముందుకెళ్లే అవకాశముందని భావిస్తున్నాయి. అప్పటి వరకూ కేంద్రం కాలయాపన చేస్తూనే ఉంటుందని చెబుతున్నాయి. కాగా, తెలంగాణలో నియోజక వర్గాలు పెరిగితే రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు సైతం పలుమార్లు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజక వర్గాల్లోనే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, నియోజక వర్గాలను పెంచితే బలమైన అభ్యర్థులు దొరకడం కష్టతరమని అభిప్రాయపడుతున్నారు.అలాగే, తెరాస నియోజక వర్గాల సంఖ్య పెరిగితే మరింత మంది పార్టీ నేతలకు అవకాసం కలిపించి,అసంతృప్తిని తగ్గించుకోవచ్చని ఆశిస్తోంది. అయితే, కోర్టుల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సరికి పుణ్య కాలం పూర్తవుతుందని అంటున్నారు.