Read more!

అనర్హత వేటు.. రాహుల్ స్వయం కృతమేనా?

ఏ ముహూర్తాన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారో ఏమో కానీ, అప్పటి నుంచి ఆయన వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్నారు. కానీ, అదే సమయంలో ఆయనను ఒకదాని వెంట ఒకటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా  ఎప్పుడో 2019 ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎలా వచ్చింది’ అని చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చేసింది. 

 ‘మోడీలంతా దొంగలే’ అనే అర్ధం వచ్చేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై. అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన  సూరత్ కోర్టు  గత గురువారం (మార్చి 23) రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. రెండేళ్ళు జైలు శిక్ష విధించింది.  దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది.   పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం చకచకా జరిగి పోయాయి. ప్రస్తుతానికి అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ... అంతే కాదు, 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యపై క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి, రెండేళ్ళు జైలు  శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌  గాంధీ ఎనిమిదేళ్ళ పాటు  ఎన్నికలలో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయారు. అయితే, సూరత్ కోర్టు తీర్పుపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం రాహుల్  గాంధీకి  30 రోజులు గడువు ఇచ్చింది. ఆ ప్రకారంగా రాహుల్ గాంధీకి  పై కోర్టులలో ఉపశమనం లభిస్తే లభించవచ్చును. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న రాజకీయ చర్చను పక్కన పెడితే రాహుల్ గాంధీ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవడం మాత్రం ఆయన స్వయం కృతమే అంటున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజుల్లో అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక  ‘మంచి’ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అయితే, కాబినెట్ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన సదరు ఆర్డినెన్స్‌  కాపీని, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పరపరా చించి పారేశారు.  నేరస్తులను రక్షించేందుకు, ఆర్డినెన్స్‌ తీసుకురావడం సిగ్గుచేటని సొంత కూటమి సర్కార్ నే ఎడాపెడా కడిగి పారేశారు. తమకున్న వీటో పవర్ తో ఆర్డినెన్స్‌ రద్దు చేయించారు. 

నిజానికి. జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే  అనర్హత అంశం పై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంటూ  మన్మోహన్ సింగ్ సర్కార్ ముందుచూపుతో తెచ్చిన ఆర్డినెన్స్‌ అది. అది అలాగే ఉంది ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడేది కాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) ను  పునరుద్ధరిస్తూ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రూపొందించింది.  రాహుల్‌ సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను అవమానించే ఉద్దేశంతో అప్పట్లో దానిని   ఆర్థం లేని ఆర్డినెన్స్‌, దోషులను కాపాడేలా ఉందంటూ అంటూ  చించేశారు. ఆ ఆర్డినెన్స్ పత్రాలను చించేసిన దాదాపు దశాబ్దం తరువాత రాహుల్ గాంధీ  స్వయంగా అనర్హతకు గురి కావడాన్ని పొయిటిక్ జస్టిస్ అనాలో మరేమనాలో కానీ   అయన స్వయంకృతం అనడంలో మాత్రం సందేహం అక్కరలేదు.

అందుకే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా  బీజేపీ, మోడీ కారణం అయితే కావచ్చును కానీ    రాహుల్ గాంధీ స్వయం కృతం కూడా కచ్చితంగా ఒక కారణం.  అలాగే, ఈ కేసును విచారించిన సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌.హెచ్‌.వర్మ తీర్పు ఇచ్చే సందర్భంగా, నిందితుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రభావం ఎక్కువ. నిందితుడికి స్వల్పశిక్ష విధిస్తే అది ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తుంది. ఎవరు ఎవరిపైనైనా సులువుగా అపనింద వేస్తారు. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని గతంలో నిందితుడు వ్యాఖ్యానించి క్షమాపణలు చెప్పిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఇకపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

అయినా ఆయన ప్రవర్తనలో మార్పేమీ ఉన్నట్లు కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు.  ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య ద్వారా పరువునష్టం కలిగించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈకేసులో చివరకు ఏమి జరుగుతుంది? అనేది పక్కన పెడితే  ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే కాదు నోరుంది కదా అని, నోరు పారేసుకునే నాయకులు అందరికీ ఇది ఒక హెచ్చరికే అని భావించాల్సి ఉంటుంది.