Read more!

ముందస్తుకే జగన్ మొగ్గు.. తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకీ?!

ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో  జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నకు ప్రజల నుంచీ, రాజకీయ పరిశీలకుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది.   మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు కవితను గుర్తుకు తెచ్చేదిగా జగన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఉందని అంటున్నారు.  గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ఇక్కటే కాదు.. భవిష్యత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఓటమి తప్పదన్న భయంతో జగన్ రెడ్డి వణికి పోతున్నట్లు కరిపిస్తోందని క్రాస్ ఓటింగ్ నెపంతో నలుగురిపై వేసిన సస్పెన్షన్ వేటును అభివర్ణిస్తున్నారు.

నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ అధినేత  నేతలు ఏమి  చేయడమో ... ఎటు పోవడమో అర్థం కాని అయోమయ పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే, ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే  సెటైర్లు వేస్తున్నారు. ఐదేళ్ల సమయం పూర్తయ్యే దాకా ఆగుదామా అంటే.. అయ్యో అలా ఎలా మొదటికే మోసం వస్తుందని మళ్లీ వాళ్లే అంటున్నారు. టుబీ ఆర్ నాట్ టుబి అన్నట్లుగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.  అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును అటూ ఇటూ తిరగేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

వాస్తవానికి ముందస్తు ముచ్చటను తెరపైకి తీసుకువచ్చినదే వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి కంటే చాలా చాలా ముందుగానే.. ఒకటికి పది సార్లు వైసీసీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో  సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఏడాది ఏణ్ణర్థం ముందు నుంచే ముందస్తు ఉందనీ లేదనీ చెబుతూ చర్చను ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతూ వస్తున్నారు.  నిజానికి  ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మక తప్పటడుగులను, తప్పుటడుగులను పెద్దగా పట్టించుకోవడం లేదు.  అలాగే  ప్రజలు కూడా ముందస్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంపై ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు.  ఎన్నికలు ఎప్పడు వచ్చినా ‘ఒక్క ఛాన్స్’ మోసానికి గట్టిగానే బదులు తీర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.  

ఇక ప్రజల నిర్ణయం, విపక్షాల వ్యూహాలు, ఉద్దేశాలతో పని లేకుండా జగన్ ముందస్తే మార్గమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఏపీలో ముందస్తు ముహూర్తంపై చర్చోపచర్చలు జోరందుకున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కూడా అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న  అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్త మౌతోంది. జగన్ కూడా అదే సమయానికి ఎన్నికలకు వెళితే బెటర్ అని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎంత ఆలస్యం చేస్తే అంతగా వైసీపీ నష్టపోతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగకుండా, వీలైతే అంత కంటే ముందుగా ఎన్నికలు జరిపిస్తే వైనాట్ 175 కాకపోయినా.. కొద్దో గోప్పో స్థానాలను గెలుచుకుని పరువు కాపాడుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక సారి ప్రజలలో వ్యతిరేకత ఉందన్న విషయం బయటపడిన తరువాత ఎన్నికలు ఎంత ఆలస్యమైతే విపక్షం అంత బలపడుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు అన్న భావన పార్టీ నాయకులలోనే వ్యక్తమౌతోంది. అందుకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్భయంగా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. సాంకేతికంగా అసెంబ్లీలో తెలుగుదేశంకు ఉన్న బలం మేరకే ఓట్లు పడినప్పటికీ.. వాస్తవ బలం కంటే నాలుగు ఓట్లు ఆ పార్టీకి ఎక్కువ పడిన సంగతి సుస్పష్టమే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే, ఇంకా ఏడాదికి పైగా ప్రభుత్వానికి గడువు ఉందని తెలిసీ క్రాస్ ఓటింగ్ చేశారంటే.. వారిలో జగన్ సర్కార్ పట్ల ఎంత అసంతృప్తి గూడు కట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవానికి జగన్ సర్కార్ పై, జగన్ తీరుపై అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 16 అని అధికార పార్టీ అగ్రనాయకత్వమే నిర్థారణకు వచ్చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ విషయాన్ని నిఘా పెట్టడం ద్వారా వైసీపీయే తేటతెల్లం చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు కూడా వేసేసింది. ఈ చర్యతో మిగిలిన అంసతృప్తులకు హెచ్చరిక పంపామని వైసీపీ భావిస్తున్నా.. అనర్హత వేటు పడిన తరువాత మేకపాటి మీడియాతో మాట్లాడిన మాటలు ‘ఎంతో రిలీఫ్’ ఫీలవుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలూ ధిక్కారం ప్రదర్శించే విషయంలో ఆయనే కాదు, అసంతృప్తులెవరూ తగ్గేదే లే అన్న మూడ్ లోనే ఉన్నారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే.. పరిస్థితి ప్రభుత్వానికి అగమ్య గోచరంగా ఉంది. ముందు ముందు తన ఫ్లాగ్ మార్క్ గా చెప్పుకుంటున్న బటన్ నొక్కుడు సంక్షేమం పందేరం చేయడం అసాధ్యంగా మారిపోతుంది. అందుకే పథకాల అమలు ఆగిపోకముందే ముందస్తుకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని అంటున్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీలు కూడా జరిగే విధంగా జగన్ వ్యూహరచనలో ఉన్నారని అంటున్నారు.